
Chepauk Super Gillies vs Nellai Royal Kings: తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) 2025లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. చెపాక్ సూపర్ గిల్లీస్, నెల్లై రాయల్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెపాక్ ఓపెనర్ కే ఆషిక్ బ్యాటింగ్ చేస్తుండగా, అతని బ్యాట్ రెండు ముక్కలైంది. విరిగిన బ్యాట్ ముక్క బౌలర్‌కు తగిలినా, అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..
జూన్ 9న కోయంబత్తూరులోని SNR కాలేజ్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో, చెపాక్ సూపర్ గిల్లీస్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో నెల్లై రాయల్ కింగ్స్ బౌలర్ ఇమాన్యుయేల్ చెరియన్ బౌలింగ్ చేస్తుండగా, ఆషిక్ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. బంతిని బలంగా కొట్టిన క్రమంలో, ఆషిక్ బ్యాట్ ఒక్కసారిగా మధ్యలో విరిగిపోయింది.
విరిగిన బ్యాట్ ముక్క నేరుగా బౌలర్ ఇమాన్యుయేల్ చెరియన్ వైపు దూసుకువచ్చింది. బంతిని ఫాలో-త్రూ చేస్తున్న చెరియన్ కాలుకు అది తగిలింది. అయితే, బౌలర్‌కు తీవ్రమైన గాయాలు కాలేదు. అదృష్టవశాత్తూ, విరిగిన బ్యాట్ ముక్క వేగంగా దూసుకువచ్చినప్పటికీ, చెరియన్ స్పల్పంగా గాయపడ్డాడు. ఈ ఘటనతో మైదానంలో కొంత క్షణం ఉత్కంఠ నెలకొంది. కెమెరా మొదట బంతిని అనుసరించినప్పటికీ, రీప్లేలో బ్యాట్ ముక్క బౌలర్ వైపు వెళ్ళడం స్పష్టంగా కనిపించింది.
ఆషిక్ అద్భుత ఇన్నింగ్స్..
இங்கு பந்தும் பறக்கும்
பேட்டும் பறக்கும் @TNCACricket #TNPL #NammaOoruNammaGethu #TNPL2025 pic.twitter.com/RcrUDwmdyc— TNPL (@TNPremierLeague) June 9, 2025
బ్యాట్ విరిగినప్పటికీ, ఆషిక్ ఏమాత్రం ప్రభావితం కాలేదు. అతను తన అద్భుతమైన బ్యాటింగ్‌ను కొనసాగించి, కేవలం 38 బంతుల్లో 54 పరుగులు చేసి, చెపాక్ సూపర్ గిల్లీస్‌కు బలమైన పునాది వేశాడు. ఆషిక్, కెప్టెన్ బాబా అపరాజిత్ (41), విజయ్ శంకర్ (నాటౌట్ 47), స్వప్నిల్ సింగ్ (45) రాణించడంతో, చెపాక్ సూపర్ గిల్లీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోరును సాధించింది.
అనంతరం, 213 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నెల్లై రాయల్ కింగ్స్ 171 పరుగులు మాత్రమే చేసి 41 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో కే ఆషిక్ ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా అతని బ్యాట్ విరిగిన క్షణం క్రికెట్ అభిమానులందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సంఘటన TNPL 2025లో ఒక విచిత్రమైన, గుర్తుండిపోయే క్షణంగా నిలిచింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..