
Alyssa Healy : క్రికెట్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆధిపత్యం గురించి అందరికీ తెలిసిందే. అలాంటి టీమ్‌కి వరల్డ్ కప్ సెమీ-ఫైనల్లో భారత జట్టు చేతిలో ఓడిపోవడం అనేది పెద్ద షాక్. నవీ ముంబైలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా నిర్దేశించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. పురుషుల లేదా మహిళల క్రికెట్ ప్రపంచ కప్ నాకౌట్‌లలో ఇంత పెద్ద ఛేజింగ్ ఇంతవరకు ఎవరూ చేయలేదు. ఈ ఓటమి ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీని ఇప్పటికీ వెంటాడుతోందట. ఆ మ్యాచ్‌లో తమ తప్పిదాలు ఏంటి, ఆ ఓటమి ఎంత బాధను మిగిల్చిందో ఆమె తాజాగా ఒక పోడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు.
ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ బ్రాడ్ హాడిన్‌తో కలిసి విల్లో టాక్ క్రికెట్ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. వరల్డ్ కప్ సెమీ-ఫైనల్‌లో భారత్ చేతిలో ఎదురైన ఓటమి తమకు ఎంత బాధ కలిగించిందో వివరించింది. ఏడు వారాల పాటు సుదీర్ఘంగా సాగిన టూర్‌లో తాము అద్భుతమైన క్రికెట్ ఆడామని, కానీ కీలకమైన ఇండియన్ హర్డిల్‌ని దాటలేకపోయామని ఆమె అంగీకరించింది.
ఈ ఓటమి నిరాశ కలిగించిందని, ఇది తనను కొంతకాలం వెంటాడుతుందని హీలీ చెప్పింది. బాధతో తాను కనీసం వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను కూడా చూడలేదని వెల్లడించింది. అయితే భారత్ గెలవడం అంతర్జాతీయ క్రికెట్‌కు మంచిదని అభిప్రాయపడింది. సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి ఫోబ్ లిచ్‌ఫీల్డ్ అద్భుత సెంచరీ సాయంతో 338 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ, హీలీ ఆ స్కోర్ కూడా తక్కువే అని అభిప్రాయపడింది. అష్ గార్డ్‌నర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో స్కోరును 338కి చేర్చినా, తాము చివరిలో కొన్ని రన్స్ కోల్పోయామని చెప్పింది.
ఒక దశలో ఎలీస్ పెర్రీ, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ మంచి భాగస్వామ్యం నెలకొల్పినప్పుడు, తమ టార్గెట్ 350 ప్లస్ గా ఉండేదని కానీ దానిని అందుకోలేకపోవడం వల్ల చివరికి అది తేడా చేసిందని హీలీ వివరించింది. మ్యాచ్ ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ, ఫీల్డింగ్‌లో చేసిన తప్పులు, పిచ్ పరిస్థితులు కూడా ప్రభావితం చేశాయని హీలీ పేర్కొంది. భారత ఇన్నింగ్స్‌లో జమైమా రోడ్రిగ్స్ సెంచరీకి ముందు, తర్వాత తాను, తహ్లియా మెక్‌గ్రాత్ రెండు కీలకమైన క్యాచ్‌లను నేలపాలు చేయడం మ్యాచ్‌ను మలుపు తిప్పిందని ఆమె అంగీకరించింది. ఆ క్యాచ్‌లు పట్టి ఉంటే ఆట వేరే విధంగా ఉండేదని హీలీ అభిప్రాయపడింది. జమైమా అజేయంగా 127 పరుగులు చేసి భారత్‌ను గెలిపించింది.
డీవై పాటిల్ స్టేడియంలో ఎర్రమట్టి పిచ్‌పై ఆడడం తమకు కొత్త అనుభవమని, సాధారణంగా తాము నల్లమట్టి పిచ్‌లపై ఆడామని చెప్పింది. ఫ్లడ్‌లైట్ల కింద పిచ్ మరింత వేగంగా మారి బంతి బాగా జారిందని, అందుకు తగ్గట్టుగా బౌలింగ్‌లో వేగాన్ని మార్చడంలో తాము ఆలస్యం చేశామని వివరించింది. హీలీ తన ఔట్ గురించి కూడా మాట్లాడింది. లైటింగ్ సమస్యలు, వర్షం అంతరాయాల వల్ల అప్పుడు మైదానంలో గందరగోళం నెలకొందని గుర్తుచేసుకుంది. బ్యాటింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో లైట్లు ఆన్ కావడం, అంపైర్లతో చర్చలు, స్క్రీన్‌ల ముందు జనం తిరగడం వంటివి భారత్‌లో సాధారణంగా జరిగే గందరగోళమని పేర్కొంది. “నాకు ఏదో చెడు జరగబోతోందనే భావన కలిగింది” అన్న హీలీ, తాను ఒక్క నిమిషం పాటు ఆగితే, వర్షం కారణంగా తాము మైదానం నుంచి బయటకు వెళ్లి తిరిగి వచ్చి కొత్తగా ప్రారంభించే అవకాశం ఉండేదని కానీ తాము ఆ అవకాశాన్ని కోల్పోయామని బాధపడింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..