
India vs New Zealand 1st T20I: న్యూజిలాండ్‌తో బుధవారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు సంబంధించి టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గాయం కారణంగా దూరమైన తిలక్ వర్మ స్థానంలో నెంబర్ 3లో ఎవరు ఆడతారనే ఉత్కంఠకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెరదించారు. శ్రేయస్ అయ్యర్ జట్టులో ఉన్నప్పటికీ, ఇషాన్ కిషన్‌కే ఆ బాధ్యతలు అప్పగించాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య నాగ్‌పూర్ వేదికగా జరగనున్న మొదటి టీ20 మ్యాచ్‌కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు. గాయపడిన తిలక్ వర్మ స్థానంలో ఇషాన్ కిషన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని ఆయన స్పష్టం చేశాడు. నిజానికి తిలక్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చినప్పటికీ, ఇషాన్‌ను ఎంచుకోవడానికి గల కారణాన్ని సూర్య వివరించాడు.
“ఇషాన్ కిషన్ మా టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో సభ్యుడు. ప్రపంచకప్ జట్టులో ఉన్న ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇవ్వడం మా బాధ్యత. అందుకే అతను మూడో స్థానంలో బరిలోకి దిగుతాడు” అని సూర్య పేర్కొన్నారు. ఇషాన్ గత ఏడాదిన్నర కాలంగా భారత్ తరపున ఆడకపోయినప్పటికీ, దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తున్నాడని సూర్య కితాబు ఇచ్చాడు.
శ్రేయస్ అయ్యర్ ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ అయినప్పటికీ, అతను కేవలం తిలక్ వర్మకు తాత్కాలిక రీప్లేస్‌మెంట్‌గా మాత్రమే మొదటి మూడు మ్యాచ్‌లకు ఎంపికయ్యాడు. కానీ ఇషాన్ కిషన్ ఇప్పటికే ప్రపంచకప్ ప్రధాన జట్టులో ఉండటంతో, టీమ్ కాంబినేషన్ దృష్ట్యా అతనికే ఓటు వేశాడు. ఒకవేళ 4 లేదా 5వ స్థానాల గురించి చర్చ జరిగితే సమీకరణాలు వేరుగా ఉండేవని, కానీ ప్రస్తుతం నెంబర్ 3కి ఇషానే సరైన ఎంపిక అని కెప్టెన్ స్పష్టం చేశాడు.
తన స్వంత బ్యాటింగ్ స్థానం గురించి మాట్లాడుతూ.. సూర్యకుమార్ తాను ఏ స్థానంలోనైనా ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. “నాకు నెంబర్ 4లో మెరుగైన రికార్డు ఉంది. కానీ, జట్టు అవసరాలను బట్టి నెంబర్ 3లో కూడా ఆడగలను. ఒకవేళ సంజూ శాంసన్ అవుట్ అయితే, పరిస్థితిని బట్టి రైట్ హ్యాండ్ బ్యాటర్ అవసరమైతే నేనే ముందుకు వెళ్తాను” అని అన్నాడు.
గత కొద్దికాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సూర్య, తన సహజ సిద్ధమైన ఆట తీరును మార్చుకోనని తేల్చి చెప్పాడు. “నాకు పరుగులు రాకపోవచ్చు, కానీ నా శైలిని మార్చుకోలేను. గత 3-4 ఏళ్లుగా నాకు సక్సెస్ ఇచ్చిన పద్ధతిలోనే బ్యాటింగ్ చేస్తాను. నెట్స్‌లో నేను ఎప్పుడూ ఆడేలాగే ఆడుతున్నాను” అని ధీమా వ్యక్తం చేశాడు.
వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు గెలుపే తనకు ముఖ్యమని సూర్య ఈ సందర్భంగా గుర్తు చేశాడు. “నేను టెన్నిస్ లేదా టీటీ లాంటి వ్యక్తిగత క్రీడలు ఆడితే నా ఫామ్ గురించి ఆందోళన చెందేవాడిని. కానీ ఇది టీమ్ గేమ్. 14 మంది ఆటగాళ్లను చూసుకోవాల్సిన బాధ్యత కెప్టెన్‌గా నాపై ఉంది. జట్టు గెలిస్తే నేను సంతోషిస్తాను” అని ముగించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..