
Irfan Pathan : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పుడు తన రికార్డుల వల్ల కాకుండా, మాజీ ఆటగాళ్ల ఆరోపణలతో వార్తల్లో నిలుస్తున్నారు. ధోనీ వల్లే తమ కెరీర్‌లు ముగిసిపోయాయని కొందరు ఆటగాళ్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల, భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 2008లో ధోనీ తనను జట్టు నుంచి తప్పించడంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని అనుకున్నానని వెల్లడించారు. ఇప్పుడు మరో ఆటగాడు కూడా ధోనీపై ఇదే విధమైన ఆరోపణలు చేశారు. ఆ ఆటగాడు మరెవరో కాదు, మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్.
మాజీ భారత పేసర్ ఇర్ఫాన్ పఠాన్ ఇటీవల, శ్రీలంకలో తాము ఒక మ్యాచ్ గెలిపించిన తర్వాత కూడా తనను జట్టు నుండి ఎలా తొలగించారో వెల్లడించారు. “నా బ్రదర్ యూసుఫ్ పఠాన్, నేను శ్రీలంకలో ఆ మ్యాచ్ గెలిపించాం. ఆ మ్యాచ్‌లో చివరి 27-28 బంతుల్లో 60 పరుగులు కావాల్సి ఉండగా, మేము గెలిచాం. ఏ ఇతర ఆటగాడు ఇలా చేసి ఉన్నా, అతను ఏడాది పాటు జట్టుకు దూరం అయ్యేవాడు కాదు” అని ఇర్ఫాన్ అన్నారు.
ఈ సంఘటన తర్వాత తాను అప్పటి హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్తో మాట్లాడానని, దానికి ఆయన కొన్ని నిర్ణయాలు నా చేతుల్లో లేవు అని చెప్పారని ఇర్ఫాన్ వెల్లడించారు. ఆ సమయంలో జట్టుకు ఒక ఆల్‌రౌండర్ అవసరమని, నంబర్ 7లో బ్యాటింగ్ చేయడానికి ఒక ఆల్‌రౌండర్ కోసం చూస్తున్నారని ఇర్ఫాన్ చెప్పారు. “నా బ్రదర్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్, నేను బౌలింగ్ ఆల్‌రౌండర్. ఇద్దరం భిన్నమైన వాళ్లం, కానీ ఒకరికి మాత్రమే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ఇద్దరు ఆల్‌రౌండర్లు అవసరమా అని అడిగితే, అందరూ అవుననే అంటారు” అని ఇర్ఫాన్ అన్నారు. ఈ వ్యాఖ్యలన్నీ ధోనీ వైపే వేలెత్తి చూపుతున్నాయి.
అంతర్జాతీయ క్రికెట్ నుండి 2020లో రిటైర్ అయినప్పటికీ, మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవల ముగిసిన 18వ ఐపీఎల్ సీజన్‌లో ఆడాడు. అయితే, అతను ఐపీఎల్ నుండి కూడా రిటైర్ అవుతాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి తన ఆడే భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకుంటారని అంచనా వేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..