
IPL Trade Window: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 కోసం ఆటగాళ్ల రిటెన్షన్ గడువు దగ్గర పడుతుండటంతో, అన్ని ఫ్రాంచైజీలు తమ జాబితాలను ఖరారు చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. రిటైన్ చేసుకునే, విడుదల చేసే ఆటగాళ్ల పేర్లను సమర్పించడానికి నవంబర్ 15 చివరి తేదీ అని తెలిసిందే.
ఈ నేపథ్యంలో, ముంబై ఇండియన్స్ (MI) శిబిరం నుంచి ఒక కొత్త నివేదిక వెలువడింది. దీని ప్రకారం యువ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ జట్టును వీడవచ్చు అని తెలుస్తోంది.
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) రెండు జట్లు ఆటగాళ్ల కోసం చర్చలు జరుపుతున్నాయి. ఇందులో అర్జున్, శార్దూల్ ఠాకూర్ ఉన్నారంట. ఈ డీల్ ఆటగాళ్ల మార్పిడి (Swap) కాకపోవచ్చని, బదులుగా వ్యక్తిగత ఒప్పందాలు కావచ్చని ఆ నివేదిక పేర్కొంది. అంటే ఈ రెండు జట్లు ఆటగాళ్ల సేవలను పొందడానికి జట్లు నగదు రూపంలో చెల్లిస్తాయని అర్థం.
అర్జున్ టెండూల్కర్ 2023లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి, ముంబై ఇండియన్స్ తరపున ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి, మూడు వికెట్లు మాత్రమే తీశాడు. అయితే, ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, ఐపీఎల్ 2025 మెగా వేలంలో అర్జున్‌ను అతని కనీస ధర రూ. 30 లక్షలకు తిరిగి కొనుగోలు చేసింది.
మరోవైపు, శార్దూల్ ఠాకూర్‌ను ఐపీఎల్ 2025 వేలంలో ఏ జట్టూ తీసుకోలేదు. కానీ, ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ మొహ్సిన్ ఖాన్ స్థానంలో LSG జట్టులోకి వచ్చాడు. శార్దూల్ ఐపీఎల్ 2025లో LSG తరపున 10 మ్యాచ్‌లు ఆడి, బ్యాట్‌తో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోయినా, 13 వికెట్లు పడగొట్టాడు.
ముంబై ఇండియన్స్ నుంచి అర్జున్ టెండూల్కర్ నిష్క్రమిస్తాడా లేదా అనేది నవంబర్ 15 గడువు తర్వాత స్పష్టమవుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..