
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ సిక్సర్ల వర్షంతోనే కాదు, ఆటగాళ్ల గాయాలతోనూ వార్తల్లో నిలుస్తోంది. నిన్న కేకేఆర్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్‌లో యువ సంచలనం సాయి సుదర్శన్ గాయపడి మైదానాన్ని వీడటం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. కేవలం సుదర్శన్ మాత్రమే కాదు, ఈ సీజన్‌లో రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి దిగ్గజాలు కూడా బ్యాటింగ్ చేస్తూ అర్థాంతరంగా వెనుదిరిగారు. అసలు ఐపీఎల్ చరిత్రలో ఇలా రిటైర్డ్ హర్ట్‌గా వెళ్ళిపోయిన ఆటగాళ్లు ఎవరు? రూల్స్ ఏం చెబుతున్నాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 248 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సాయి సుదర్శన్ దూకుడుగా ఆడుతున్నాడు. అయితే కార్తీక్ త్యాగి వేసిన 138 కిమీ వేగవంతమైన బంతి నేరుగా సుదర్శన్ ఎడమ మోచేతికి బలంగా తగిలింది. నొప్పితో విలవిలలాడిన అతను ఫిజియో చికిత్స తర్వాత కూడా బ్యాటింగ్ కొనసాగించలేకపోయాడు. 13 బంతుల్లో 23 పరుగులు చేసిన దశలో అతను రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అతని స్థానంలో నిశాంత్ సింధు క్రీజులోకి వచ్చాడు.
ఈ సీజన్‌లోనే ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ కూడా గాయపడ్డాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో 19 పరుగుల వద్ద రోహిత్ బ్యాటింగ్ ఆపేశాడు. అలాగే లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ కూడా జోష్ హాజిల్‌వుడ్ వేసిన బౌన్సర్ తగలడంతో మోచేతి నొప్పితో విలవిలలాడి రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. ఆర్‌సీబీ ప్లేయర్ అక్షర్ పటేల్ కూడా 26 పరుగుల వద్ద గాయం కారణంగా వెనుదిరగాల్సి వచ్చింది.
రిటైర్డ్ హర్ట్ అంటే ఏమిటి? రిటైర్డ్ అవుట్‌కు తేడా ఏంటి?
క్రికెట్ నిబంధనల ప్రకారం (MCC Law 25.4), ఒక ఆటగాడు అనారోగ్యం లేదా గాయం వల్ల బ్యాటింగ్ చేయలేకపోతే రిటైర్డ్ హర్ట్‌గా పరిగణిస్తారు. సదరు బ్యాటర్ కోలుకుంటే, వికెట్ పడినప్పుడు మళ్ళీ వచ్చి బ్యాటింగ్ చేయవచ్చు. కానీ రిటైర్డ్ అవుట్ అనేది ఒక వ్యూహాత్మక నిర్ణయం. వేగంగా పరుగులు చేయాలనే ఉద్దేశంతో బ్యాటర్ స్వచ్ఛందంగా వెనుదిరిగితే, అతను మళ్ళీ బ్యాటింగ్ చేయడానికి వీలుండదు.
ఐపీఎల్ చరిత్రలో రిటైర్డ్ హర్ట్ అయిన ప్రముఖ ఆటగాళ్ల జాబితా:
ఐపీఎల్ ఆరంభం నుంచి ఇప్పటివరకు మైదానంలో గాయపడి వెనుదిరిగిన కొందరు కీలక ఆటగాళ్లు వీరే:
డొమినిక్ థోర్న్లీ (ముంబై ఇండియన్స్): 2008లో 0 పరుగుల వద్ద.
వీవీఎస్ లక్ష్మణ్ (డెక్కన్ ఛార్జర్స్): 2010లో 10 పరుగుల వద్ద.
హర్భజన్ సింగ్ (ముంబై ఇండియన్స్): 2010లో 8 పరుగుల వద్ద, మళ్ళీ 2014లో 10 పరుగుల వద్ద.
సచిన్ టెండూల్కర్ (ముంబై ఇండియన్స్): 2012లో 16 పరుగుల వద్ద, 2013లో 38 పరుగుల వద్ద.
ఆరోన్ ఫించ్ (ముంబై ఇండియన్స్): 2015లో 10 పరుగుల వద్ద.
కెవిన్ పీటర్సన్ (రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్): 2016లో 0 పరుగుల వద్ద.
శిఖర్ ధావన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్): 2018లో 0 పరుగుల వద్ద.
అంబటి రాయుడు (చెన్నై సూపర్ కింగ్స్): 2021లో 0 పరుగుల వద్ద.
సంజూ శాంసన్ (రాజస్థాన్ రాయల్స్): 2025లో 31 పరుగుల వద్ద.
రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్): 2026లో 19 పరుగుల వద్ద.
రిషబ్ పంత్ (లక్నో సూపర్ జెయింట్స్): 2026లో 0 పరుగుల వద్ద.
సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్): 2026లో 23 పరుగుల వద్ద.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..