AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ20లతోపాటు ప్రపంచకప్ నుంచి తీసేసిన గంభీర్.. కట్‌చేస్తే.. 72 ఫోర్లు, 33 సిక్సర్లతో ఇచ్చిపడేశాడుగా..!

Mohammad Kaif on Shubman Gill: అవమానాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, శ్రమను నమ్ముకుంటే ఎంతటి ఘనవిజయాలు సాధించవచ్చో శుభ్‌మన్ గిల్ నిరూపించాడు. ఈ క్వాలిఫైయర్ శతకం కేవలం గుజరాత్ జట్టును ఫైనల్‌కు చేర్చడమే కాకుండా, టీ20 క్రికెట్‌లో తన స్థానాన్ని ప్రశ్నించిన సెలెక్టర్లకు గిల్ ఇచ్చిన బలమైన చెంపదెబ్బగా నిలిచిపోతుంది.

టీ20లతోపాటు ప్రపంచకప్ నుంచి తీసేసిన గంభీర్.. కట్‌చేస్తే.. 72 ఫోర్లు, 33 సిక్సర్లతో ఇచ్చిపడేశాడుగా..!
Shubman Gill Ipl 2026 Runs
Venkata Chari
|

Updated on: May 30, 2026 | 2:52 PM

Share

Mohammad Kaif on Shubman Gill: సాధారణంగా టీ20 ప్రపంచకప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీకి కొద్దిరోజుల ముందు జట్టు వైస్ కెప్టెన్‌ను తొలగిస్తే ఏ ఆటగాడైనా కుంగిపోతాడు. విమర్శల ఒత్తిడితో ఫామ్ కోల్పోతాడు. కానీ, నిజమైన పోరాటయోధుడు మైదానంలో తన బ్యాట్‌తోనే సమాధానం చెప్తాడు. సరిగ్గా ఇదే తరహాలో టీమిండియా టీ20 ప్రపంచకప్ 2026 జట్టు నుంచి తనను తప్పించిన సెలెక్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ, ఐపీఎల్ 2026లో పరుగుల సునామీ సృష్టించాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.

అవమాన భారంలోంచి పుట్టిన పరుగుల ప్రవాహం..

గత ఏడాది కాలంగా శుభ్‌మన్ గిల్ నెమ్మదైన బ్యాటింగ్ శైలిపై, టీ20 ఫామ్‌పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఆ నెపంతోనే టీ20 ప్రపంచకప్ 2026 జట్టు ప్రకటనలో సెలెక్టర్లు అతడికి మొండిచేయి చూపించారు. జట్టు డిప్యూటీ కెప్టెన్‌గా ఉన్న ఆటగాడిని ఏకంగా టోర్నీ నుంచే పక్కన పెట్టడం భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, విమర్శకులకు నోటితో కాకుండా ఆటతోనే సమాధానం చెప్పాలని గిల్ గట్టిగా నిశ్చయించుకున్నాడు.

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-2 లాంటి అత్యంత కీలకమైన ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో గిల్ ఆడిన ఇన్నింగ్స్ శతాబ్దాల పాటు గుర్తుండిపోతుంది. ప్రత్యర్థి నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో కేవలం 53 బంతుల్లోనే 104 పరుగులు చేసి చారిత్రాత్మక శతకంతో జట్టును ఒంటరి చేత్తో ఫైనల్‌కు నడిపించాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే అతిపెద్ద రన్ చేజ్‌ను గుజరాత్ కేవలం 18.4 ఓవర్లలోనే ముగించిందంటే గిల్ విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు.

గణాంకాలతో సెలెక్టర్ల మైండ్ బ్లాక్..

ప్రపంచకప్ జట్టులో స్థానం కోల్పోయిన బాధను తనపై ఏమాత్రం పడకుండా చూసుకున్న గిల్, ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో నిలకడైన ప్రదర్శనతో ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 15 మ్యాచ్‌ల్లో 48.13 సగటుతో, 163.71 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 722 పరుగులు సాధించాడు. ఇందులో 72 ఫోర్లు, 33 సిక్సర్లు ఉన్నాయి. రాజస్థాన్ బౌలర్లపై ఒక్కడే 15 ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుకుపడి తాను ఈ పొట్టి ఫార్మాట్‌కు ఎంతటి ప్రమాదకరమైన ఆటగాడో నిరూపించాడు.

మహమ్మద్ కైఫ్ ప్రశంసల జల్లు..

శుభ్‌మన్ గిల్ ప్రదర్శించిన ఈ అద్భుత పోరాట పటిమకు భారత మాజీ దిగ్గజ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఫిదా అయ్యాడు. సామాజిక మాధ్యమం వేదికగా గిల్ మానసిక దృఢత్వాన్ని కైఫ్ కొనియాడాడు.

“ప్రపంచకప్ జట్టు నుంచి తొలగించినా గిల్ ఎక్కడా సహనం కోల్పోలేదు. కేవలం తన బ్యాట్ ద్వారానే మాట్లాడాడు. ప్లేఆఫ్స్ చరిత్రలో అతిపెద్ద రన్ చేజ్‌కు సారథ్యం వహిస్తూ అద్భుత సెంచరీ బాదాడు. ఈ క్రమంలో 700కు పైగా పరుగులు, 164 స్ట్రైక్ రేట్, మ్యాచ్ విజేత అవార్డు సాధించడం గిల్ సింహగర్జనకు నిదర్శనం. కెప్టెన్‌గా అతడికి ఇది మొదటి ఐపీఎల్ ఫైనల్. ఇదొక అద్భుతమైన పునరాగమనం” అని కైఫ్ ట్వీట్ చేశాడు.

ఆరెంజ్ క్యాప్‌తో పాటు ఐపీఎల్ ట్రోఫీపై కన్ను..

ప్రస్తుతం పరుగుల వేటలో 722 పరుగులతో గిల్ రెండో స్థానానికి చేరుకున్నాడు. అగ్రస్థానంలో ఉన్న వైభవ్ సూర్యవంశీ (776 పరుగులు) కంటే అతడు కేవలం 55 పరుగులు మాత్రమే వెనుకబడి ఉన్నాడు. మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌లో గిల్ కెప్టెన్‌గా తన తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడటమే కాకుండా, ఆరెంజ్ క్యాప్‌ను సైతం సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us