
IPL 2026 Orange Cap : ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగిసి, ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ప్రారంభమవడంతో టోర్నమెంట్ అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌తో అసలు సిసలైన నాకౌట్ ఫైట్ మొదలైంది. ఈ ఏడాది ఐపీఎల్ 19వ ఎడిషన్‌లో భారీ స్కోర్లు, సిక్సర్లు, ఫోర్ల వర్షం కురుస్తుండటంతో అభిమానులకు కావాల్సినంత వినోదం లభిస్తోంది. ఒకవైపు జట్లు ట్రోఫీ కోసం పోటీ పడుతుంటే.. మరోవైపు టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ప్రతిష్టాత్మక ఆరెంజ్ క్యాప్ కోసం బ్యాటర్ల మధ్య పోరు క్లైమాక్స్‌కు చేరింది. ఈ సీజన్‌లో ఇప్పటికే బ్యాటర్లు ఏకంగా 9 సెంచరీలు బాదడం విశేషం. ప్రస్తుతం ప్లేఆఫ్స్ రేసులో ఉంటూ, ఆరెంజ్ క్యాప్ కొట్టే అవకాశం ఉన్న ఆ టాప్-5 రేసర్స్ ఎవరో చూద్దాం.
5. వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్) – 583 పరుగులు
ఈ జాబితాలో అందరినీ అత్యంత ఆశ్చర్యపరిచిన పేరు 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. బీహార్‌కు చెందిన ఈ అద్భుతమైన యువ బ్యాటర్ తన డెబ్యూ సీజన్‌లోనే క్రికెట్ ప్రపంచం నోరెళ్లబెట్టేలా ప్రదర్శన చేశాడు. లీగ్ దశ ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ 583 పరుగులు సాధించాడు. టాప్-5 లో ఉన్న బ్యాటర్లందరి కంటే ఇతని స్ట్రైక్ రేట్ (232.27) అత్యధికంగా ఉండటం విశేషం. ఈ సీజన్‌లో అతను ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు బాదడమే కాకుండా కొద్దిరోజుల పాటు ఆరెంజ్ క్యాప్‌ను కూడా తన వద్దే ఉంచుకున్నాడు. రాజస్థాన్ ప్లేఆఫ్స్‌లో మరిన్ని మ్యాచ్‌లు ఆడనుండటంతో ఇతను ఈ రేసులో మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
4. విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 600 పరుగులు
ఆరెంజ్ క్యాప్ రేసు అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు కింగ్ కోహ్లీ. ఐపీఎల్ చరిత్రలో జరిగిన అన్ని 19 ఎడిషన్లలోనూ ఆడిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ, ఈసారి కూడా పరుగుల వేటలో టాప్‌లో ఉన్నాడు. ఆర్‌సీబీకి బ్యాక్-టు-బ్యాక్ ట్రోఫీలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ, ఈ సీజన్‌లో ఇప్పటివరకు 600 పరుగులు పూర్తి చేశాడు. విశేషం ఏమిటంటే.. అతని ఐపీఎల్ కెరీర్‌లోనే బెస్ట్ అనదగ్గ రీతిలో 164.38 స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు సాధించడం విశేషం. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ రేసులో ముందంజ వేస్తుండటంతో కోహ్లీ మరోసారి ఆరెంజ్ క్యాప్ ముద్దాడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
3. హెన్రిచ్ క్లాసెన్ (సన్ రైజర్స్ హైదరాబాద్) – 606 పరుగులు
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మిడిల్ ఆర్డర్ వెన్నుముక, సౌతాఫ్రికా క్లాస్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ ఈ జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ క్లాసెన్ తన మునుపటి ఫామ్‌ను ఏమాత్రం కోల్పోలేదు. ఈ సీజన్‌లో 159.47 స్ట్రైక్ రేట్‌తో, 6 హాఫ్ సెంచరీల సాయంతో 606 పరుగులు చేశాడు. క్లాసెన్ ఐపీఎల్ కెరీర్‌లోనే ఇది అత్యుత్తమ సీజన్ అని చెప్పవచ్చు. ఎస్‌ఆర్‌హెచ్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడబోతుండటంతో క్లాసెన్ బ్యాట్ ఝులిపిస్తే ఆరెంజ్ క్యాప్ రేసులో విప్లవం సృష్టించడం ఖాయం.
2. శుభ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్) – 618 పరుగులు
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ సీజన్‌లో అటు కెప్టెన్సీ బాధ్యతలను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తూనే, ఇటు బ్యాటింగ్‌లోనూ దుమ్మురేపుతున్నాడు. గిల్ ఇప్పటివరకు 159.27 స్ట్రైక్ రేట్‌తో 6 హాఫ్ సెంచరీలు బాది 618 పరుగులతో 2వ స్థానంలో నిలిచాడు. క్వాలిఫైయర్ 1 లో గుజరాత్ జట్టు టాప్-2 లో ఉండటం వల్ల గిల్‌కు ఫైనల్ చేరడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిగిలిన మ్యాచ్‌ల్లో గిల్ భారీ స్కోర్లు సాధిస్తే ఆరెంజ్ క్యాప్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
1. సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్) – 652 పరుగులు
ప్రస్తుతం ఐపీఎల్ 2026 ఆరెంజ్ క్యాప్ రేసులో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ 652 పరుగులతో సింహాసనంపై కూర్చున్నాడు. లీగ్ దశ ముగిసే సమయానికి 14 మ్యాచ్‌ల్లో 46.57 సగటుతో, 157.86 స్ట్రైక్ రేట్‌తో 638 పరుగులు చేసిన సుదర్శన్, క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో మరో 14 పరుగులు జోడించి మొత్తం 652 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఇందులో ఒక సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ 2025 సీజన్‌లో కూడా ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న సాయి సుదర్శన్.. ఈసారి కూడా దానిని నిలబెట్టుకుని బ్యాక్-టు-బ్యాక్ టైటిల్స్ సాధించాలని కసితో ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..