IPL 2026 : ఆరెంజ్ క్యాప్ రేసులో క్లాసెన్‌ను వెనక్కి నెట్టి టాప్‌లోకి సాయి సుదర్శన్.. పర్పుల్ క్యాప్ ఎవరిదంటే?

IPL 2026 : ఐపీఎల్ 2026లో సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. టీ20ల్లో వేగంగా 3000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. పర్పుల్ క్యాప్ రేసులో మరోవైపు వికెట్ల వేటలో ఆర్‌సీబీ స్పీడ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు.

IPL 2026 : ఆరెంజ్ క్యాప్ రేసులో  క్లాసెన్‌ను వెనక్కి నెట్టి టాప్‌లోకి సాయి సుదర్శన్.. పర్పుల్ క్యాప్ ఎవరిదంటే?
Orange Cap Purple Cap

Updated on: May 17, 2026 | 9:44 AM

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంటున్న వేళ.. ఆటగాళ్ల మధ్య ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ కోసం పోరు రసవత్తరంగా మారుతోంది. శనివారం కేకేఆర్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ఈ జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు నెంబర్ వన్ స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్‌ను వెనక్కి నెట్టి, గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్‌ను తన సొంతం చేసుకున్నాడు. మరోవైపు వికెట్ల వేటలో ఆర్‌సీబీ స్పీడ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు.

కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో సాయి సుదర్శన్ కేవలం 28 బంతుల్లో 53 పరుగులు చేసి అదరగొట్టాడు. ఈ క్రమంలోనే టీ20 క్రికెట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో (78) 3000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు షాన్ మార్ష్ (85 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో సుదర్శన్ మొత్తం 554 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అయితే అతని వెంటే గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 552 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. కేవలం రెండు పరుగుల తేడాతో వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో 12 మ్యాచ్‌ల్లో 484 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీకి ఈరోజు (మే 17) పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో కోహ్లీ గనుక భారీ స్కోరు సాధిస్తే, గుజరాత్ ఓపెనర్లను వెనక్కి నెట్టి మళ్ళీ టాప్ ప్లేస్‌కు వెళ్లే అవకాశం ఉంది. వీరితో పాటు సంచలన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ కూడా 440 పరుగులతో 9వ స్థానంలో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతను చెలరేగితే టాప్-5 లోకి రావడం ఖాయం.

వికెట్ల వేటలో ఆర్‌సీబీ సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన స్వింగ్ మాయాజాలంతో పర్పుల్ క్యాప్‌ను వదలడం లేదు. భువీ ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీసి టాప్‌లో ఉన్నాడు. అయితే గుజరాత్ బౌలర్ కాగిసో రబడ 13 మ్యాచ్‌ల్లో 21 వికెట్లతో భువీకి గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌కూ ఈ గణాంకాలు మారిపోతుండటంతో లీగ్ దశ ముగిసేసరికి ఈ క్యాప్ ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ ఫ్యాన్స్‌లో నెలకొంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us