
Jaiswal-Suryavanshi : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. వీరిద్దరూ కలిసి క్రీజులోకి వస్తే చాలు, ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా ఈ జోడీ భారత క్రికెట్ దిగ్గజాలు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ పేరిట ఉన్న ఒక అరుదైన రికార్డును బద్దలు కొట్టి వార్తల్లో నిలిచారు. కేవలం పరుగులే కాదు, సిక్సర్ల వర్షంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడీగా వీరు అవతరించారు.
భారత ఓపెనింగ్ జోడీలలో వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ అంటే ఒకప్పుడు భయం ఉండేది. ఐపీఎల్‌లో అతి తక్కువ బంతుల్లో (309 బంతులు) 500 పరుగులు పూర్తి చేసిన భారత ఓపెనింగ్ జోడీగా వీరిద్దరి పేరిట రికార్డు ఉండేది. అయితే, రాజస్థాన్ రాయల్స్ కుర్రాళ్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఈ రికార్డును తుడిచిపెట్టేశారు. ఏప్రిల్ 4న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 248 బంతుల్లోనే 500 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసి, సెహ్వాగ్-గంభీర్ కంటే 61 బంతులు ముందే ఈ మైలురాయిని చేరుకున్నారు.
వైభవ్, యశస్వి జోడీ కేవలం పరుగులు తీయడమే కాదు, బంతిని స్టాండ్స్‌లోకి పంపడంలోనూ రికార్డులు సృష్టిస్తున్నారు. గత సీజన్ నుండి ఇప్పటివరకు పవర్‌ప్లేలో యశస్వి జైస్వాల్ 25 సిక్సర్లు బాదగా, వైభవ్ 20 సిక్సర్లు కొట్టాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వీరిద్దరూ కలిసి కొట్టిన సిక్సర్ల సంఖ్య ఐపీఎల్‌లోని కొన్ని జట్లు మొత్తం కొట్టిన సిక్సర్ల కంటే ఎక్కువగా ఉండటం. ఉదాహరణకు పవర్‌ప్లేలో చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 21 సిక్సర్లు మాత్రమే కొట్టగా, వీరిద్దరే కలిసి అంతకంటే ఎక్కువ విధ్వంసం సృష్టించారు. 200 పైచిలుకు స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్న ఏకైక ఓపెనింగ్ జోడీ కూడా వీరే కావడం విశేషం.
యశస్వి, వైభవ్ కలిసి ఓపెనింగ్ చేయడం ఇది రెండో సీజన్. మొదటి సీజన్‌లోనే తమ సత్తా చాటిన ఈ జంట, 2026లో మరింత పరిణతితో ఆడుతోంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ రెండో బంతికే 500 పరుగుల పార్టనర్‌షిప్ పూర్తి చేసి చరిత్రకెక్కారు. బౌలర్ ఎవరన్నది చూడకుండా మొదటి బంతి నుంచే అటాకింగ్ గేమ్ ఆడటం వీరి ప్రత్యేకత. వీరి దూకుడు చూస్తుంటే ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు తిరుగులేదనిపిస్తోంది.
వీరిద్దరి బ్యాటింగ్ శైలి చూస్తుంటే టీమిండియాకు పక్కా ఓపెనింగ్ జోడీ దొరికిందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ తన చిన్న వయసులోనే ఇంతటి ధైర్యంతో ఆడటం చూసి దిగ్గజ క్రికెటర్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. యశస్వి జైస్వాల్ అనుభవం, వైభవ్ దూకుడు తోడవ్వడంతో రాజస్థాన్ రాయల్స్ ప్రతి మ్యాచ్‌లోనూ పవర్‌ప్లేలోనే సగం విజయాన్ని ఖాయం చేసుకుంటోంది. రాబోయే మ్యాచ్‌ల్లో ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతారో చూడాలి.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..