GT vs RR : వైభవ్ కోసం గుజరాత్ రివర్స్ స్కెచ్.. ఎలా అవుట్ చేయాలో చెప్పిన కోచ్ పార్థివ్ పటేల్
GT vs RR : వైభవ్ సూర్యవంశీని అవుట్ చేయడానికి గుజరాత్ బౌలర్లు ఎలాంటి వ్యూహాలు వేస్తున్నారనే దానిపై పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "వైభవ్ సూర్యవంశీ కోసం మా దగ్గర పక్కా ప్లాన్స్ ఉన్నాయి. కానీ, ఆ ప్లాన్స్ ఏంటనేది నేను ఇప్పుడే బయటపెట్టను.

GT vs RR : ఐపీఎల్ 2026 రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు తలపడటానికి సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌లో అడుగుపెట్టి డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతుంది. అయితే, ఈ చావో రేవో తేల్చుకునే పోరులో గుజరాత్ టైటాన్స్ జట్టు ముందున్న అత్యంత పెద్ద సవాలు ఏంటంటే.. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్, 15 ఏళ్ల రన్ మెషిన్ వైభవ్ సూర్యవంశీని ఎలా తక్కువ పరుగులకే అవుట్ చేయాలనేదే. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై వైభవ్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ చూసిన తర్వాత గుజరాత్ క్యాంప్ అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని కట్టడి చేయడానికి తాము ప్రత్యేక వ్యూహాలు రచించామని గుజరాత్ అసిస్టెంట్ కోచ్ పార్థివ్ పటేల్ స్పష్టం చేశారు.
వైభవ్ సూర్యవంశీని అవుట్ చేయడానికి గుజరాత్ బౌలర్లు ఎలాంటి వ్యూహాలు వేస్తున్నారనే దానిపై పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “వైభవ్ సూర్యవంశీ కోసం మా దగ్గర పక్కా ప్లాన్స్ ఉన్నాయి. కానీ, ఆ ప్లాన్స్ ఏంటనేది నేను ఇప్పుడే బయటపెట్టను. నేనేమీ టీవీ బ్రాడ్‌కాస్టర్‌ను కాదు కదా.. ముందే లీక్ చేయడానికి! వైభవ్ బ్యాటింగ్ చూస్తుంటే నిజంగా చాలా ముచ్చటేస్తోంది, ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. కానీ, మా ప్లాన్స్‌ను సరిగ్గా అమలు చేసి, అతన్ని మ్యాచ్ ఆరంభంలోనే వికెట్ తీయాలని భావిస్తున్నాం. అసలు ప్లాన్ ఏంటో మీకే మైదానంలోనే లైవ్‌గా తెలుస్తుంది” అంటూ పార్థివ్ పటేల్ సస్పెన్స్ స్క్రిప్ట్ రాశారు. గత మ్యాచ్‌లో సిరాజ్ బౌలింగ్‌లో వైభవ్ అవుట్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
సోషల్ మీడియాలో, క్రికెట్ సర్కిల్స్‌లో వైభవ్ సూర్యవంశీ వయసు (15 ఏళ్లు) గురించి జరుగుతున్న చర్చలపై పార్థివ్ పటేల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైభవ్ వయసు గురించి మాట్లాడటం పూర్తిగా దండగ అని కొట్టిపారేశారు. “వైభవ్ ఆడుతున్న అద్భుతమైన బ్యాటింగ్ స్టైల్‌ను ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. అతని వయసు గురించి పదే పదే చర్చించాల్సిన అవసరం లేదు, దానికి ఇక్కడితో బ్రేక్ వేయడం మంచిది. అతనిలో అద్బుతమైన టాలెంట్ ఉంది. అయితే, ఒక ప్రత్యర్థి జట్టుగా అతను మాపై ఎక్కువ పరుగులు చేయకూడదనే మేము కోరుకుంటాం” అని పార్థివ్ చెప్పుకొచ్చారు.
మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీపై గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ వంటి స్టార్ ప్లేయర్లు రాణించకపోవడంతో ఆ మ్యాచ్‌లో గుజరాత్ ఓడిపోవాల్సి వచ్చింది. అయితే, ఈ పాత ఓటమిని తాము పెద్దగా పట్టించుకోవడం లేదని పార్థివ్ పటేల్ అన్నారు. “మా ఆట తీరును మార్చుకోవాల్సిన అవసరం గానీ, టీమ్‌లో పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం గానీ లేదు. వేరే జట్లు మా గురించి ఏమైనా అనుకోవచ్చు.. కానీ మేము పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచాం. మేము ఎలాంటి క్రికెట్ ఆడాలో మాకు బాగా తెలుసు. గుజరాత్ జట్టు ఇప్పటివరకు ఆడిన ఐదు సీజన్లలో నాలుగు సార్లు ప్లేఆఫ్స్ చేరింది, ఒకసారి ఐపీఎల్ టైటిల్ కూడా గెలిచింది. క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్ తన పాత స్టైల్లోనే ఆడుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
