IPL 2026 : 3 కోట్లకు కొంటే.. 30 కోట్ల విలువైన ఆట ఆడుతున్నాడు..డెబ్యూ సీజన్‌లోనే వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన కూపర్ కోనోలీ
IPL 2026 : పంజాబ్ కింగ్స్ బ్యాటర్ కూపర్ కోనోలీ ఐపీఎల్ 2026 లో సంచలనం సృష్టించాడు. అరంగేట్రం సీజన్‌లోనే 32 సిక్సర్లు బాది జయసూర్య రికార్డును బద్దలు కొట్టాడు. పెట్టిన ప్రతి పైసాకు న్యాయం చేస్తూ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు.

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతున్నా ఆ జట్టుకు దొరికిన ఒక డైమండ్ మాత్రం రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియా యువ హిట్టర్ కూపర్ కోనోలీ ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో అరంగేట్రం సీజన్‌లోనే తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఐపీఎల్ ఆడుతున్న మొదటి సీజన్‌లోనే అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా కోనోలీ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య 19 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును కోనోలీ కనుమరుగు చేశాడు.
2008లో జరిగిన మొట్టమొదటి ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన సనత్ జయసూర్య 31 సిక్సర్లు బాది రికార్డు సృష్టించాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డును కూపర్ కోనోలీ ఇప్పుడు తన 32వ సిక్సర్‌తో బద్దలు కొట్టాడు. కేవలం 3 కోట్ల రూపాయల ధరకే పంజాబ్ దక్కించుకున్న ఈ ఆసీస్ ఆటగాడు, పెట్టిన ప్రతి పైసాకు న్యాయం చేస్తూ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఈ జాబితాలో జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (28 సిక్సర్లు), ఫిన్ అలెన్ (27 సిక్సర్లు) వంటి పవర్ హిట్టర్లు కోనోలీ తర్వాత స్థానాల్లో ఉన్నారు.
ఈ సీజన్‌లో కూపర్ కోనోలీ ప్రదర్శన చూస్తుంటే దిగ్గజ బ్యాటర్లే విస్తుపోతున్నారు. ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో 47.30 సగటుతో 473 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 162.54గా ఉండటం విశేషం. ఈ సీజన్‌లో ఇప్పటికే ఒక సెంచరీ (107 నాటౌట్), రెండు హాఫ్ సెంచరీలు బాదిన కోనోలీ, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. పంజాబ్ కింగ్స్ మిడిల్ ఆర్డర్‌లో కోనోలీ ఇప్పుడు ఒక నమ్మదగ్గ ఫినిషర్‌గా ఎదిగాడు.
కోనోలీ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, పంజాబ్ కింగ్స్ జట్టు పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం 13 మ్యాచుల్లో 6 విజయాలతో 13 పాయింట్లు ఉన్న పంజాబ్, తన చివరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. గెలిచినా కూడా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. తమ స్టార్ ప్లేయర్ కోనోలీ ఫామ్‌ను కొనసాగిస్తూ చివరి మ్యాచ్‌లోనైనా జట్టును గట్టెక్కిస్తాడా లేదా అనేది చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
