IPL 2023: ‘నువ్వు తోపు భయ్యా..’ 7 బంతులు, 12 నిమిషాలు.. కట్ చేస్తే.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.!

కొండంత లక్ష్యం.. స్లో స్టార్ట్.. వెరిసి సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేరు. కానీ చివరి ఓవర్‌లో జరిగిన పరిణామాలు.. ఎస్‌ఆర్‌హెచ్ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాయి.

IPL 2023: నువ్వు తోపు భయ్యా.. 7 బంతులు, 12 నిమిషాలు.. కట్ చేస్తే.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.!
Glenn Phillips

Updated on: May 08, 2023 | 12:46 PM

కొండంత లక్ష్యం.. స్లో స్టార్ట్.. వెరిసి సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేరు. కానీ చివరి ఓవర్‌లో జరిగిన పరిణామాలు.. ఎస్‌ఆర్‌హెచ్ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాయి. హైదరాబాద్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(55), రాహుల్ త్రిపాఠి(47) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించినా.. వీరిద్దరికీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు దక్కలేదు. కేవలం 7 బంతులు, 12 నిమిషాల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన ఈ ప్లేయర్‌కు వరించింది. అతడెవరో కాదు గ్లెన్ ఫిలిప్స్. రూ. 13.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్ చేయని పని.. కేవలం 7 బంతుల్లో ముగించాడు గ్లెన్ ఫిలిప్స్. ఐపీఎల్‌ మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 1.5 కోట్లకు గ్లెన్ ఫిలిప్స్‌ను కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో రెండో మ్యాచ్ ఆడుతున్న అతడు 12 నిమిషాల్లో సంచలనం సృష్టించాడు. కేవలం 7 బంతుల్లో 357.14 స్ట్రైక్ రేట్‌తో 25 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 1 ఫోర్, 3 సిక్సర్లు ఉన్నాయి.

ఫిలిప్స్ క్రీజులోకి రాకముందు సన్‌రైజర్స్ గెలవడమే కష్టం. అయితే అతడు వచ్చి వెళ్లిపోయాక హైదరాబాద్ లాస్ట్ ఓవర్ చేజ్ చాలా సులువైంది. గ్లెన్ ఫిలిప్స్ క్రీజులోకి వచ్చేసరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 44 పరుగుల దూరంలో ఉంది. అతడు వచ్చిన వెంటనే మొదటి రెండు బంతుల్లో 3 పరుగులు చేశాడు. దీంతో సన్‌రైజర్స్ చివరి 2 ఓవర్లలో 41 పరుగులు చేయాలి. విజయం కష్టంగా ఉందని అనుకునేసరికి ఫిలిప్స్.. 19వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌ను టార్గెట్ చేశాడు. తొలి 3 బంతుల్లో 3 సిక్సర్లు బాదేశాడు. ఆ తర్వాత నాలుగో బంతికి ఫోర్ కొట్టాడు. కానీ 5వ బంతికి అవుట్ అయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ పేలుడు ఇన్నింగ్స్ కారణంగా చివరి ఓవర్‌లో సన్‌రైజర్స్ విజయానికి 17 పరుగులు చేయాల్సి ఉంది. ఆఖరి ఓవర్‌లో ఈ టార్గెట్‌ను అబ్దుల్ సమద్ పూర్తి చేశాడు. దీంతో ప్లే-ఆఫ్స్ రేసును సజీవం చేసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. తన 7 బంతుల విధ్వంసకర ఇన్నింగ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు గ్లెన్ ఫిలిప్స్.