ఐపీఎల్ 2023 (IPL 2023) ఇప్పుడు ఎంతో దూరంలో లేదు. 2023 ఐపీఎల్‌కి ముందు మినీ వేలం జరగనుంది. ప్రస్తుతం అందరి చూపు దానిపైనే ఉంది. మినీ వేలంలో చాలా మంది ఆటగాళ్లు వేలంలోకి రానున్నారు. ఇందులో సామ్ కరన్, బెన్ స్టోక్స్, కెమరూన్ గ్రీన్ వంటి స్టార్ ఆటగాళ్లపైనే అన్ని ఫ్రాంచైజీల దృష్టి ఉంటుంది. ఇది కాకుండా, ఐపీఎల్‌లోని మొత్తం 10 జట్లు దేశీయ ఆటగాళ్లపై కూడా తమ చూపును ఉంచాయి. ఇందులో ఈ ముగ్గురు ఆటగాళ్లను తమతో పాటు చేర్చుకోవాలని అన్ని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. వారు ఎవరు, ఎందుకు అన్ని జట్లు వారి కోసం ఎదురుచూస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
గతేడాది చెన్నై సూపర్ కింగ్స్‌లో ఉన్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నారాయణ్ జగదీషన్ ఈసారి మినీ వేలానికి ముందు విడుదలయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీలో జగదీషన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నారాయణ్ జగదీషన్ 141 బంతుల్లో 277 పరుగుల ఇన్నింగ్స్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 25 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. జగదీషన్ ఇప్పటివరకు విజయ్ హజారే ట్రోఫీలో 140కి పైగా స్ట్రైక్ రేట్‌తో 700కు పైగా పరుగులు చేశాడు. మినీ వేలానికి అతని ఈ ప్రదర్శన చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.
IPL 2023 కోసం సౌరాష్ట్ర తుఫాన్ బ్యాట్స్‌మెన్ సమర్థ్ వ్యాస్ మినీ వేలంలో అందరి దృష్టిలో ఉండనున్నాడు. 2022లో ఆడిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సమర్థ్ వ్యాస్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఇప్పటివరకు తన టీ20 కెరీర్‌లో సమర్థ్ 151 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేస్తున్నాడు. అతను 28 T20 మ్యాచ్‌లలో 30 సగటు, 151 స్ట్రైక్ రేట్‌తో 649 పరుగులు చేశాడు. అన్ని ఫ్రాంచైజీలు సమర్థ్‌పై కన్నేశాయి. మరి ఇప్పుడు మినీ వేలంలో ఎంత ధర పలుకుతాడో చూడాలి.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ హిట్టర్ సన్వీర్ సింగ్ అద్భుతం ఫాంలో ఉన్నాడు. సిక్సర్లు, ఫోర్లతో అందరినీ పిచ్చెక్కిస్తున్నాడు. అతను 2022లో ఆడిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్‌లలో 205.17 స్ట్రైక్ రేట్‌తో 119 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంది. ఇక మినీ వేలంలో ఏ ధరకు కొనుగోలు చేస్తారో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..