T20 World Cup 2026 : పాయింట్ల పట్టికలో భారత్ జోరు.. సెమీస్ టికెట్ కోసం సండే కోల్‌కతాలో అసలైన వార్

T20 World Cup 2026 : సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు మొదటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయి టెన్షన్‌లో పడినప్పటికీ, జింబాబ్వే పై విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సమీకరణాలు చాలా ఆసక్తికరంగా మారాయి.

T20 World Cup 2026 : పాయింట్ల పట్టికలో భారత్ జోరు.. సెమీస్ టికెట్ కోసం సండే కోల్‌కతాలో అసలైన వార్
India Semi Final Equation

Updated on: Feb 27, 2026 | 6:49 AM

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ క్లైమాక్స్‌కు చేరుకుంది. చెన్నై వేదికగా జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా, ఇప్పుడు సెమీఫైనల్ బెర్త్ కోసం సిద్ధమైంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు మొదటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయి టెన్షన్‌లో పడినప్పటికీ, జింబాబ్వేపై విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సమీకరణాలు చాలా ఆసక్తికరంగా మారాయి. గ్రూప్-1 నుంచి ఇప్పటికే సౌతాఫ్రికా సెమీస్‌కు దూసుకెళ్లగా, జింబాబ్వే కథ ముగిసింది. ఇప్పుడు మిగిలిన ఒక్క సెమీస్ స్థానం కోసం భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య భారీ యుద్ధం జరగనుంది.

ఫిబ్రవరి 26న జరిగిన మ్యాచులు భారత జట్టుకు కలిసొచ్చాయి. మొదట జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు వెస్టిండీస్‌ను ఓడించడంతో టీమిండియాకు రూట్ క్లియర్ అయ్యింది. ఆ తర్వాత భారత్ తన వంతుగా జింబాబ్వేను చిత్తు చేసి 2 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం గ్రూప్-1లో భారత్, వెస్టిండీస్ రెండు జట్లూ రెండేసి మ్యాచులు ఆడి, చెరో విజయం (2 పాయింట్లు)తో సమానంగా ఉన్నాయి. దీనివల్ల ఆదివారం (మార్చి 01) జరగబోయే భారత్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ ఒక వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లేదా నకౌట్ మ్యాచ్‌గా మారిపోయింది.

ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తే చాలు, నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. ఇక్కడ నెట్ రన్ రేట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గెలిచిన జట్టుకు 4 పాయింట్లు వస్తాయి, ఓడిన జట్టు 2 పాయింట్ల దగ్గరే ఆగిపోతుంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఎవరైతే విజేతగా నిలుస్తారో వారే సౌతాఫ్రికాతో పాటు సెమీఫైనల్ టికెట్ అందుకుంటారు. కరేబియన్ హిట్టర్లు సొంత గడ్డపై ఆడుతున్నంత ప్రమాదకరంగా ఉంటారు కాబట్టి, భారత్ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మూల్యం చెల్లించుకోక తప్పదు.

భారత బ్యాటర్లు అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఫామ్‌లో ఉండటం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. జింబాబ్వేపై 256 పరుగుల రికార్డు స్కోరు సాధించిన ఉత్సాహంతో భారత్ ఉంది. ఆదివారం మ్యాచ్‌లో కూడా ఇదే జోరు కొనసాగిస్తే, వెస్టిండీస్‌ను ఓడించి సెమీస్‌కు వెళ్లడం కష్టమేమీ కాదు. మొత్తం మీద టీ20 వరల్డ్ కప్ 2026లో గ్రూప్-1 నుంచి రెండో సెమీఫైనలిస్ట్ ఎవరో తేలేందుకు ఈ సూపర్ సండే కీలకం కానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us