మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. 172 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 38 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టపోయి ఛేదించింది. భారత మాజీ కెప్టెన్, గ్రేట్ బ్యాట్స్‌ఉమెన్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత, టీమ్ ఇండియా వన్డే మ్యాచ్ ఆడేందుకు రావడం ఇదే తొలిసారి. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భారత మహిళల జట్టు విజయంతో కొత్త శకాన్ని ప్రారంభించింది.
భారత్ తరపున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 44, ఓపెనర్ షెఫాలీ వర్మ 35, హర్లీన్ డియోల్ 34 పరుగులు చేశారు. భారత మహిళల జట్టు శ్రీలంకను 48.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ చేసింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్, దీప్తి శర్మ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
భారత బౌలర్ల ముందు తడబడిన శ్రీలంక బ్యాటర్స్..
టాస్ ఓడి, ఫీల్డింగ్‌కు వచ్చిన శ్రీలంక పరిస్థితి ఏమంత బాగోలేదు. భారత బౌలర్ రేణుక ప్రత్యర్థి జట్టు కెప్టెన్ చమరి అటపట్టుని కేవలం 2 పరుగులకే పెవిలియన్ చేర్చింది. దీంతో మూడో ఓవర్‌లోనే భారత్‌కు శుభారంభాన్ని అందించింది. ఆ తర్వాత దీప్తి ఖాతా తెరవకుండానే హన్సిమా కరుణరత్నేను ఔట్ చేసింది. ఓపెనర్లు హాసిని, హర్షిత మాధవి (28) మూడో వికెట్‌కు 34 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు పునరాగమనం చేసేందుకు ప్రయత్నించారు. తన 54 బంతుల ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు కొట్టిన హాసినిని దీప్తి అవుట్ చేయగా, ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ కవిషా దిల్హారీకి ఖాతా తెరిచే అవకాశం కూడా ఇవ్వలేదు.
ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో 65 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకోవడంతో శ్రీలంక కష్టాల్లో పడింది. అయితే నీలాక్షి ఒక ఎండ్ నుంచి స్కోరును 140 దాటించింది. వికెట్ కీపర్ అనుష్క సంజీవని (18) నుంచి మద్దతు లభించడంతో.. ఇద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. దీని తర్వాత స్కోరును 170 పరుగులకు మించి తీసుకెళ్లేందుకు ఆ జట్టు టెయిలెండ్ బ్యాటర్స్ నానా తంటాలు పడ్డారు. దీప్తి, రేణుక చెరో మూడు వికెట్లు తీయగా, పూజా వస్త్రాకర్ 2, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వెటరన్ స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ చెరో వికెట్ తీశారు. శ్రీలంక తరపున నీలక్షి డిసిల్వా 43 పరుగులు చేయగా, హాసిని పెరీరా 37 పరుగులు చేసింది.