Vaishnavi Sharma : కోహ్లీ అంటే ఆమాత్రం ఉండాలి మరి.. లేడీ క్రికెటర్ మనసు దోచేసిన కింగ్

Viral Video : శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేసిన భారత మహిళా క్రికెటర్ వైష్ణవి శర్మ, విరాట్ కోహ్లీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “విరాట్ కోహ్లీలో ఒక ప్రత్యేకమైన ఛార్మ్ ఉంది” అంటూ ఆమె చెప్పిన మాటలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

Vaishnavi Sharma : కోహ్లీ అంటే ఆమాత్రం ఉండాలి మరి.. లేడీ క్రికెటర్ మనసు దోచేసిన కింగ్
Vaishnavi Sharma Virat Kohli

Updated on: Jan 02, 2026 | 7:54 PM

Vaishnavi Sharma : భారత మహిళా క్రికెట్ జట్టులో కొత్త మెరుపులు మెరిపిస్తున్న యువ సంచలనం వైష్ణవి శర్మ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేసి తన బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించిన ఈ కుర్రది, ఇప్పుడు మైదానం బయట తన మనసులోని మాటను బయటపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

టీమిండియా లేడీ క్రికెటర్ వైష్ణవి శర్మకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఒక ఇంటర్వ్యూయర్ ఆమెను “మీకు ఇప్పటివరకు కనిపించిన క్రికెటర్లలో అత్యంత అందమైన క్రికెటర్ ఎవరు?” అని అడిగారు. దీనికి వైష్ణవి ఏమాత్రం తడబడకుండా వెంటనే విరాట్ కోహ్లీ అని సమాధానం ఇచ్చింది. “విరాట్ కోహ్లీలో ఒక రకమైన ఛార్మ్ ఉంటుంది. అది రికార్డుల విషయంలో కావచ్చు, కెప్టెన్సీలో కావచ్చు లేదా అతని ఫిట్‌నెస్ విషయంలో కావచ్చు.. ప్రతిదీ అద్భుతం. ఆయన మంచి ఫీల్డర్, మంచి వ్యక్తి, పైగా చూడటానికి చాలా బాగుంటారు. ఇంకా ఏం కావాలి?” అంటూ కోహ్లీపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది.

శ్రీలంకతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైష్ణవి శర్మ తన అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది. డిసెంబర్ 21న జరిగిన మొదటి మ్యాచ్‌లో వికెట్లు తీయకపోయినప్పటికీ, తన పొదుపైన బౌలింగ్‌తో (ఎకానమీ 6.26) అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత జరిగిన రెండో, నాలుగో మ్యాచ్‌ల్లో రెండేసి వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది. మొత్తం 5 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు తీసి సెలక్టర్ల దృష్టిలో పడింది. కేవలం 20 ఏళ్ల వయసులోనే టీమిండియా జెర్సీ ధరించి సత్తా చాటడం విశేషం.

వైష్ణవి శర్మ నేపథ్యం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 2005 డిసెంబర్ 18న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలో జన్మించిన వైష్ణవి తండ్రి ఒక జ్యోతిష్కుడు. తన కూతురు భవిష్యత్తు క్రికెట్లోనే ఉందని ఆయన ముందే గుర్తించారేమో.. వైష్ణవికి కేవలం 4 ఏళ్ల వయసున్నప్పటి నుంచే ఆయన క్రికెట్ బ్యాట్ పట్టించి దగ్గరలోని మైదానంలో ప్రాక్టీస్ చేయించడం మొదలుపెట్టారు. తండ్రి నమ్మకాన్ని నిజం చేస్తూ వైష్ణవి ఇప్పుడు దేశం గర్వించే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ఆమె వయసు 20 ఏళ్లు మాత్రమే కావడంతో, భారత మహిళా క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణంగా ఆమెను విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

విరాట్ కోహ్లీ కేవలం వైష్ణవి శర్మకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది యువ క్రికెటర్లకు రోల్ మోడల్. ప్రస్తుతం కోహ్లీ టీ20 ఇంటర్నేషనల్స్, టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతున్నారు. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో కోహ్లీ మళ్ళీ బ్యాట్ పట్టుకుని రంగంలోకి దిగనున్నారు. వైష్ణవి శర్మ చేసిన ఈ వ్యాఖ్యలు విరాట్ కోహ్లీకి ఉన్న అపారమైన క్రేజ్‌ను మరోసారి నిరూపించాయి. మైదానంలో పట్టుదల, మైదానం బయట క్రమశిక్షణే కోహ్లీని కింగ్‎ను చేశాయని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..