Women’s Kabaddi World Cup : ఓటమే ఎరుగని మన ఆడబిడ్డలు.. రెండో సారి మహిళల కబడ్డీ వరల్డ్ కప్ మనదే!

భారత మహిళల కబడ్డీ జట్టు మరోసారి తమ సత్తా చాటుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన మహిళల కబడ్డీ వరల్డ్ కప్ 2025 ఫైనల్‌లో భారత్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 35-28 తేడాతో బలమైన చైనీస్ తైపీని ఓడించి, వరుసగా రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.

Womens Kabaddi World Cup : ఓటమే ఎరుగని మన ఆడబిడ్డలు.. రెండో సారి  మహిళల కబడ్డీ వరల్డ్ కప్ మనదే!
Women's Kabaddi World Cup

Updated on: Nov 25, 2025 | 6:22 AM

Women’s Kabaddi World Cup : భారత మహిళల కబడ్డీ జట్టు మరోసారి తమ సత్తా చాటుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన మహిళల కబడ్డీ వరల్డ్ కప్ 2025 ఫైనల్‌లో భారత్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 35-28 తేడాతో బలమైన చైనీస్ తైపీని ఓడించి, వరుసగా రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 11 దేశాలు పాల్గొనగా, భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కప్‌ను గెలుచుకోవడం ఒక గొప్ప విషయం. ఈ విజయం భారత కబడ్డీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది.

ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. చైనీస్ తైపీ జట్టు భారత మహిళా జట్టుకు గట్టి పోటీ ఇచ్చింది. అయితే భారత కెప్టెన్ రితు నేగి, వైస్ కెప్టెన్ పుష్పా రాణా అద్భుతమైన నాయకత్వ పటిమ కనబరిచారు. ముఖ్యంగా సంజూ దేవి చేసిన సూపర్ రైడ్ జట్టుకు కీలక మలుపునిచ్చి, మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. ఈ ప్రదర్శనతో భారత్ విజయాన్ని సులభతరం చేసుకుంది. భారత జట్టు కేవలం ఫైనల్‌లోనే కాదు, టోర్నమెంట్ అంతటా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గ్రూప్ స్టేజ్‌లో థాయ్‌లాండ్‌ను 68-17 తేడాతో, నేపాల్‌ను 50-12 తేడాతో ఓడించింది. సెమీ-ఫైనల్‌లో బలమైన ఇరాన్ జట్టును 33-21 తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.

భారత మహిళల జట్టు సాధించిన ఈ చారిత్రక విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా జట్టును అభినందించారు. “కబడ్డీ వరల్డ్ కప్ 2025 గెలిచి దేశ గౌరవాన్ని పెంచిన మా మహిళల కబడ్డీ జట్టుకు అభినందనలు. ఈ విజయం ఎంతో మంది యువతకు కబడ్డీలో ముందుకు వెళ్లడానికి, పెద్ద కలలు కనడానికి స్ఫూర్తినిస్తుంది” అని ఆయన అన్నారు. ప్రొ కబడ్డీ లీగ్‌కు చెందిన కోచ్‌లు అజయ్ ఠాకూర్ (పుణేరి పల్టాన్), మన్‌ప్రీత్ సింగ్ (హర్యానా స్టీలర్స్) వంటి కబడ్డీ నిపుణులు కూడా టీమ్ ఇండియాను ప్రత్యేకంగా అభినందించారు. మొత్తంగా భారత మహిళల జట్టు అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ కబడ్డీ వేదికపై తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..