
U19 World Cup : జింబాబ్వేలోని బులవాయో వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచింది. ఆకాశం మేఘావృతమై ఉండటం, పిచ్ బౌలర్లకు సహకరించే అవకాశం ఉండటంతో కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో అమెరికా జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ద్వారా 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ అండర్-19 వరల్డ్ కప్ ఆడుతున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.
టాస్ పడినప్పటికీ బులవాయోలో వాతావరణం కాస్త ఆందోళన కలిగిస్తోంది. నేడు అక్కడ సుమారు 47% నుంచి 70% వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మేఘాల చాటున సూర్యుడు దాక్కున్న వేళ, భారత పేసర్లు దీపేష్ దేవేంద్రన్, ఆర్.ఎస్. అంబరీష్ ఆరంభంలోనే వికెట్లు పడగొట్టాలని చూస్తున్నారు. ఒకవేళ వర్షం అంతరాయం కలిగించకపోతే, భారత కుర్రాళ్లు మరో భారీ విజయంతో టోర్నీని ఆరంభించడం ఖాయంగా కనిపిస్తోంది.
రికార్డులు ఏం చెబుతున్నాయి?
అండర్-19 వన్డేల్లో భారత్, అమెరికా జట్లు గతంలో కేవలం ఒక్కసారి మాత్రమే (2024 వరల్డ్ కప్‌లో) తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 201 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆనాడు భారత్ 326 పరుగులు చేయగా, అమెరికా కేవలం 125 పరుగులకే కుప్పకూలింది. 717 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు వరల్డ్ కప్ వేదికగానే ఈ రెండు జట్లు తలపడుతుండటంతో పాత ఫలితం పునరావృతం అవుతుందా? లేక అమెరికా ఏమైనా షాక్ ఇస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..