
IND vs NZ : తిరువనంతపురం వేదికగా జరిగిన చివరి టీ20 పోరులో టీమిండియా సింహగర్జన చేసింది. బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ శతక్కొడితే, బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లతో కివీస్ నడ్డి విరిచాడు. చివరి వికెట్‌ను ఫినిషర్ రింకూ సింగ్ తీయడం ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. దీంతో న్యూజిలాండ్‌ను 46 పరుగుల తేడాతో ఓడించిన భారత్, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో ఘనంగా కైవసం చేసుకుంది.
టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు టీమిండియా అదిరిపోయే ముగింపునిచ్చింది. శనివారం జరిగిన ఆఖరి టీ20లో భారత్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 42 బంతుల్లోనే చేసిన మెరుపు సెంచరీ (103) మరియు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (63), హార్దిక్ పాండ్యా (42) మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 271/5 పరుగుల రికార్డు స్కోరును నమోదు చేసింది.
272 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు ఒకానొక సమయంలో టీమిండియాను భయపెట్టింది. ఫిన్ అలెన్ కేవలం 38 బంతుల్లోనే 80 పరుగులు చేసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ తన స్పెల్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. కీలక సమయంలో వికెట్లు తీస్తూ కివీస్ జోరుకు బ్రేకులు వేశాడు. అర్ష్‌దీప్ తన 4 ఓవర్ల కోటాలో 51 పరుగులు ఇచ్చినప్పటికీ, 5 వికెట్లు పడగొట్టి (ఫైఫర్) కివీస్ పతనాన్ని శాసించాడు.
మధ్యలో అక్షర్ పటేల్ రెండు కీలక వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ సాధించాడు. చివరికి న్యూజిలాండ్ జట్టు 19.4 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌట్ అయింది. విచిత్రమైన విషయం ఏమిటంటే, మ్యాచ్ చివరి వికెట్‌ను పార్ట్-టైమ్ బౌలర్ రింకూ సింగ్ తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో 46 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించడమే కాకుండా, సిరీస్‌ను 4-1తో గెలుచుకుంది. టీ20 చరిత్రలో భారత్‌కు ఇది మూడో అత్యధిక స్కోరు కావడం విశేషం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..