IND vs SA 1st Test Day 1 Report: విఫలమైన భారత బ్యాటర్లు.. పరువు కాపాడిన కేఎల్ రాహుల్.. తొలిరోజు హోరాహోరీ..

|

Dec 26, 2023 | 8:55 PM

KL Rahul: బాక్సింగ్ డే టెస్ట్‌లో మొదటి రోజు కేఎల్ రాహుల్ అద్భుత ఆటతీరుతో టీమిండియా పరువు కాపాడాడు. క్లిష్ట పరిస్థితుల్లో హాఫ్ సెంచరీ సాధించి టీమ్ ఇండియాను కష్టాల నుంచి గట్టెక్కించాడు. వర్షం కారణంగా తొలిరోజు ఆట పూర్తి కాకపోవడంతో రెండో రోజు స్కోరు 250కి చేరుకునే అవకాశం ఉంది. కాగా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.

IND vs SA 1st Test Day 1 Report: విఫలమైన భారత బ్యాటర్లు.. పరువు కాపాడిన కేఎల్ రాహుల్.. తొలిరోజు హోరాహోరీ..
Ind Vs Sa Kl Rahul
Follow us on

IND vs SA 1st Test Day 1 Report: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలిరోజు బాక్సింగ్ డే టెస్ట్ ఉత్కంఠగా సాగింది. ముందుగా టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను షేక్ చేసిన సౌతాఫ్రికా బౌలర్లు అందరిలో కంగారు పుట్టించగా.. ఆ తర్వాత కేఎల్ రాహుల్ అద్భుత బ్యాటింగ్‌తో ఆఫ్రికా బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. అయితే, చివరికి వర్షం ఆటను చెడగొట్టడంతో నిర్ణీత సమయానికి చాలా ముందుగానే మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.

రబాడ ముందు తలవంచిన టీమిండియా..

ఈ మ్యాచ్‌లో ఆఫ్రికన్ కెప్టెన్ టెంబా బావుమా టాస్ గెలిచి టీమ్ ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి జట్టులోకి పునరాగమనం చేయడంతో అందరి చూపు వారిపైనే పడింది. కానీ, ఆఫ్రికా ఆటగాడు కగిసో రబడా ఆట మొత్తాన్ని చెడగొట్టాడు. తొలిరోజే ఐదు వికెట్లు తీసిన రబడా భారత జట్టును వెన్నుపోటు పొడిచాడు.

రబాడ ముందు టీమ్ ఇండియా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ తడబడింది. దక్షిణాఫ్రికా తరపున రబడా ఐదు వికెట్లు తీయగా, మార్కో జెన్సన్ ఒక వికెట్, నాండ్రే బెర్గర్ రెండు వికెట్లు తీశారు.

టీమిండియా పరువు కాపాడిన కేఎల్ రాహుల్..

కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 5 స్కోరు వద్ద అవుట్ అయిన వెంటనే టాప్ ఆర్డర్ తడబాటుకు గురైంది. యశస్వి జైస్వాల్ 17 పరుగులు మాత్రమే చేయగా, శుభమన్ గిల్ 2 పరుగులు మాత్రమే చేసి, పెవిలియన్ చేరారు. ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత టీమ్ ఇండియాను విరాట్ కోహ్లీ (38), శ్రేయాస్ అయ్యర్ (31) ఆదుకున్నప్పటికీ, 107 పరుగుల వద్ద విరాట్ కోహ్లి ఔట్ కాగా, టీమిండియా జట్టులో సగం మంది పెవిలియన్ బాట పట్టారు.

ఆ తర్వాత, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా టెస్ట్ క్రికెట్‌లో పునరాగమనం చేస్తున్న కేఎల్ రాహుల్ బాధ్యతలు స్వీకరించాడు. కష్ట సమయాల్లో, రాహుల్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో బ్యాటింగ్ చేసి, తొలి రోజు ఆట ముగిసే వరకు 70 పరుగుల స్కోరుతో నాటౌట్‌గా నిలిచాడు. పిచ్ ప్రకారం కేఎల్ రాహుల్ ఈ ఇన్నింగ్స్ టీమ్ ఇండియాకు చాలా సహాయపడింది. కేఎల్ రాహుల్ రాణించడంతోనే టీమిండియా తొలిరోజు 59 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగలిగింది. ఆ సమయంలో వర్షం కారణంగా తొలి రోజు ఆట ముగిసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..