
India vs NZ T20I : భారత్ గడ్డపై న్యూజిలాండ్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్, విరాట్ వంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ భారత్‌ను 2-1తో ఓడించి, మన దేశంలో తొలిసారి వన్డే సిరీస్ గెలిచిన జట్టుగా రికార్డుకెక్కింది. ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. ఈ క్రమంలో కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మాకు భారత్‌లో ఆడటం అంటే చాలా ఇష్టం. ఇక్కడి పరిస్థితులు మాకు బాగా తెలుసు. వరల్డ్ కప్ ముందర భారత్ వంటి పటిష్టమైన జట్టుతో తలపడటం మాకు మంచి ప్రాక్టీస్” అని ఆయన పేర్కొన్నారు.
అయితే, టీ20 రికార్డులు చూస్తే భారత్‌దే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 25 టీ20 మ్యాచ్‌లు జరగగా, భారత్ 14 మ్యాచ్‌ల్లో (సూపర్ ఓవర్లతో కలిపి) గెలిచింది. న్యూజిలాండ్ 10 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. గత మూడు ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లలో భారతే విజేతగా నిలిచింది. కానీ, కివీస్ జట్టు ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు కచ్చితంగా సవాల్ ఎదురయ్యేలా కనిపిస్తోంది. ముఖ్యంగా వన్డేల్లో సెంచరీలతో విరుచుకుపడ్డ డారిల్ మిచెల్ టీ20ల్లో కూడా అదే ఫామ్ కొనసాగిస్తే టీమిండియా బౌలర్లకు కష్టాలు తప్పవు.
న్యూజిలాండ్ జట్టు భారత్‌లో చివరిసారి టీ20 సిరీస్ గెలిచింది 2012లో. అప్పుడు జరిగిన ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు భారత్‌లో కివీస్‌కు సిరీస్ దక్కలేదు. అయితే, సాంట్నర్ చెప్పినట్లుగా వారు కోరిక నెరవేర్చుకోవాలంటే, భారత స్పిన్ అటాక్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు, సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ ఫామ్‌ను తిరిగి పుంజుకోవాలని చూస్తున్నాడు. వరల్డ్ కప్‌కు ముందు జరుగుతున్న ఈ మినీ వార్ లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..