
IND vs NZ : భారత్, న్యూజిలాండ్ జట్లు టీ20ల్లో తలపడినప్పుడల్లా పోరు హోరాహోరీగా సాగుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు మొత్తం 25 అంతర్జాతీయ టీ20ల్లో ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో టీమిండియా స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కివీస్ జట్టు 10 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ద్వైపాక్షిక సిరీస్‌ల విషయానికొస్తే, ఇప్పటివరకు జరిగిన 8 సిరీస్‌లలో భారత్ 5 గెలిచింది. ముఖ్యంగా గత నాలుగు సిరీస్‌లుగా టీమిండియాను కివీస్ ఓడించలేకపోయింది.
సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. యువ సంచలనం తిలక్ వర్మ, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయాల కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. తిలక్ స్థానంలో సీనియర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రాగా, సుందర్ స్థానాన్ని లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ భర్తీ చేయనున్నారు. ఇక టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. అతని సారథ్యంలో భారత్ ఇప్పటివరకు ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. అయితే, గత 22 ఇన్నింగ్స్‌లుగా సూర్య బ్యాట్ నుంచి కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా రాకపోవడం అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేస్తోంది.
వచ్చే నెలలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు భారత్‌కు ఇదే ఆఖరి సిరీస్. జనవరి 21 (బుధవారం) నాగ్‌పూర్ వేదికగా తొలి టీ20 జరగనుంది. వన్డే సిరీస్‌లో చారిత్రాత్మక విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న న్యూజిలాండ్‌ను సొంత గడ్డపై అడ్డుకోవడం సూర్య సేనకు అతిపెద్ద సవాల్. సొంత పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ, మిచెల్ సాంట్నర్ సారథ్యంలోని కివీస్ జట్టును తక్కువ అంచనా వేయలేం. ముఖ్యంగా హోల్కర్ స్టేడియంలో ఓటమి తర్వాత, టీమిండియా కుర్రాళ్లు ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉన్నారు.