
IND vs NZ : దక్షిణాఫ్రికాతో స్వదేశీ సిరీస్ ముగిసిన తర్వాత, భారత క్రికెట్ జట్టు ఇప్పుడు కాస్త విరామం తీసుకోనుంది. మళ్ళీ 2026 కొత్త సంవత్సరంలో టీమిండియా గర్జించబోతోంది. జనవరిలోనే న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్లు 3 వన్డేలు, 5 టీ20లు ఆడనున్నాయి. ఈ సిరీస్ షెడ్యూల్, వేదికలు, ఇతర ఆసక్తికర వివరాలు తెలుసుకుందాం.
2026 సంవత్సరంలో భారత్ ఆడబోయే మొదటి మ్యాచ్ న్యూజిలాండ్‌తోనే. జనవరి 11న వడోదర వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. విశేషమేమిటంటే, దాదాపు 16 ఏళ్ల తర్వాత వడోదరలో పురుషుల అంతర్జాతీయ మ్యాచ్ జరగబోతోంది. ఈ వన్డే సిరీస్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో వన్డే రాజ్‌కోట్‌లో, మూడో వన్డే ఇండోర్‌లో జరగనున్నాయి. వన్డే చరిత్రలో భారత్-న్యూజిలాండ్ 120 సార్లు తలపడగా.. టీమిండియా 62 సార్లు, కివీస్ 50 సార్లు విజయం సాధించాయి.
వన్డే సిరీస్ ముగిసిన వెంటనే జనవరి 21 నుంచి టీ20 సమరం మొదలవుతుంది. ఫిబ్రవరిలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 కోసం టీమిండియాకు ఇదే ఆఖరి తయారీ సిరీస్. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఇరు జట్ల మధ్య 25 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 14 మ్యాచ్‌లు గెలవగా, న్యూజిలాండ్ 10 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ టై అయింది. అందుకే ఈ సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఈ జట్టు బరిలోకి దిగనుంది. టీ20 మ్యాచ్‌లు అన్నీ రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతాయి. నాగపూర్, రాయ్‌పూర్, గువహటి, విశాఖపట్నం, తిరువనంతపురం వేదికలుగా ఈ ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి.
భారత్ vs న్యూజిలాండ్ పూర్తి షెడ్యూల్ (2026):
వన్డే సిరీస్ (మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం):
జనవరి 11: మొదటి వన్డే – వడోదర (కొతంబి స్టేడియం)
జనవరి 14: రెండో వన్డే – రాజ్‌కోట్
జనవరి 18: మూడో వన్డే – ఇండోర్
టీ20 సిరీస్ (రాత్రి 7:00 గంటలకు ప్రారంభం):
జనవరి 21: మొదటి టీ20 – నాగపూర్
జనవరి 23: రెండో టీ20 – రాయ్‌పూర్
జనవరి 25: మూడో టీ20 – గువహటి
జనవరి 28: నాలుగో టీ20 – విశాఖపట్నం
జనవరి 31: ఐదో టీ20 – తిరువనంతపురం