
దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి టైటిల్‌ను కైవసం చేసుకోవాలన్న టీమిండియా ఆశలను పాకిస్థాన్ అడ్డుకుంది. ఈ పోరులో 191 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్ విజయం సాధించగా, భారత్ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అయితే, మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఛైర్మన్, పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి అయిన మొహ్సిన్ నఖ్వీ మైదానంలోనే ఉన్నప్పటికీ, భారత ఆటగాళ్లకు మెడల్స్ అందించింది ఆయన కాదు.
సాధారణంగా ఏసీసీ ఛైర్మన్ హోదాలో నఖ్వీ మెడల్స్ అందించాల్సి ఉంటుంది. కానీ, భారత ఆటగాళ్లు స్టేజ్ వద్ద ఉన్న నఖ్వీ దగ్గరకు వెళ్లకుండా, పోడియం ముందున్న ఖాళీ ప్రదేశంలోనే తమ మెడల్స్‌ను స్వీకరించారు. ఐసీసీ అసోసియేట్ మెంబర్ డైరెక్టర్లలో ఒకరైన ముబష్శిర్ ఉస్మానీ చేతుల మీదుగా భారత క్రికెటర్లు రన్నరప్ మెడల్స్‌ను అందుకున్నారు.
భారత జట్టు ఇలా నఖ్వీని నిరాకరించడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మొదట్లో జరిగిన సీనియర్ ఆసియా కప్ ఫైనల్‌లోనూ పాకిస్థాన్‌ను ఓడించి టైటిల్ గెలిచిన అనంతరం, టీమిండియా నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించింది. దీంతో ఆయన ఆ ట్రోఫీని తనతో పాటే వెనక్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత జట్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గత మే నెలలో సరిహద్దుల్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారత పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి నిరసనగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో పాక్ మంత్రులతో వేదికను పంచుకోవడానికి లేదా వారితో కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా భారత్ సిద్ధంగా లేదు. బీసీసీఐ ‘నో-హ్యాండ్ షేక్’ పాలసీని కచ్చితంగా అమలు చేస్తోంది.
మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 348 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో టీమిండియా తడబడింది. 68 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత్, చివరకు 156 పరుగులకే కుప్పకూలి ఓటమిని చవిచూసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..