IND vs SL : కుంబ్లే, అశ్విన్, హర్భజన్.. శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే

IND vs SL : భారత్, శ్రీలంక టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో ఉన్నారు. అనిల్ కుంబ్లే, అశ్విన్, హర్భజన్, కపిల్ దేవ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. యాక్టివ్ ప్లేయర్లలో రవీంద్ర జడేజా ఒక్కడే టాప్-10లో చోటు దక్కించుకున్నారు.

IND vs SL : కుంబ్లే, అశ్విన్, హర్భజన్.. శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే
Ind Vs Sl

Updated on: Aug 04, 2026 | 7:05 PM

IND vs SL : టీమిండియా ఆగస్టు 15, 2026 నుంచి శ్రీలంకలో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తలపడనుంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో భారత్‌కు ఈ సిరీస్ అత్యంత కీలకంగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా ఈ సిరీస్‌ను ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో, శ్రీలంక ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో భారత్, శ్రీలంక టెస్ట్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల వివరాలు ఆసక్తికరంగా మారాయి.

నంబర్-1 స్థానంలో ముత్తయ్య మురళీధరన్

భారత్, శ్రీలంక మధ్య 1982 నుంచి టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆయన భారత్‌పై 22 టెస్టుల్లో ఏకంగా 105 వికెట్లు పడగొట్టి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 18 టెస్టుల్లో 74 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 11 మ్యాచ్‌ల్లో 62 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో స్థానంలో హర్భజన్ సింగ్ (53 వికెట్లు), ఐదో స్థానంలో కపిల్ దేవ్ (45 వికెట్లు) ఉన్నారు.

యాక్టివ్ ప్లేయర్లలో రవీంద్ర జడేజా ఒక్కడే

ఈ హెవీవెయిట్ బౌలర్ల జాబితాలో ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఒక్కడే చోటు దక్కించుకోవడం విశేషం. 37 ఏళ్ల జడేజా ఇప్పటివరకు శ్రీలంకపై 7 టెస్టులాడి 33 వికెట్లు పడగొట్టి ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. రాబోయే లంక పర్యటనకు జడేజా భారత జట్టులో ఎంపికయ్యాడు. ఈ జాబితాలో ఆరో స్థానంలో ఇషాంత్ శర్మ (36 వికెట్లు), ఏడో స్థానంలో శ్రీలంక మాజీ స్పిన్నర్ అజంతా మెండిస్ (34 వికెట్లు), తొమ్మిదో స్థానంలో రంగన హేరత్ (33 వికెట్లు), పదో స్థానంలో చమిండ వాస్ (30 వికెట్లు) నిలిచారు.

టాప్ 10 అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితా:

ముత్తయ్య మురళీధరన్ – 105 వికెట్లు

అనిల్ కుంబ్లే – 74 వికెట్లు

రవిచంద్రన్ అశ్విన్ – 62 వికెట్లు

హర్భజన్ సింగ్ – 53 వికెట్లు

కపిల్ దేవ్ – 45 వికెట్లు

ఇషాంత్ శర్మ – 36 వికెట్లు

అజంతా మెండిస్ – 34 వికెట్లు

రవీంద్ర జడేజా – 33 వికెట్లు

రంగన హేరత్ – 33 వికెట్లు

చమిండ వాస్ – 30 వికెట్లు

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us