
India vs South Africa: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వన్డేలో సెంచరీ చేస్తే టీమిండియా విజయం ఖాయం అనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉండేది. అయితే, ఈ నమ్మకానికి 7 ఏళ్ల తర్వాత బ్రేక్ పడింది. రాయ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుత శతకం సాధించినప్పటికీ, భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
సాధారణంగా వన్డేల్లో కోహ్లీ సెంచరీ చేస్తే భారత్ గెలిచి తీరుతుంది. గత ఏడేళ్లుగా ఇదే సెంటిమెంట్ కొనసాగుతూ వస్తోంది. కానీ, బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 102 పరుగులు చేసి, తన కెరీర్‌లో 53వ వన్డే శతకాన్ని నమోదు చేసినా, భారత్ గెలవలేకపోయింది. చివరిసారిగా 2019 మార్చిలో ఆస్ట్రేలియాతో రాంచీలో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ (123) చేసినా భారత్ ఓడిపోయింది. అప్పటి నుంచి నిన్నటి రాయ్‌పూర్ మ్యాచ్ వరకు, కోహ్లీ సెంచరీ చేసిన ప్రతిసారీ భారత్ విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో కోహ్లీ శతకంతో పాటు రుతురాజ్ గైక్వాడ్ కూడా సెంచరీ చేయడంతో భారత్ 358 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే, దక్షిణాఫ్రికా బ్యాటర్లు అద్భుత పోరాటపటిమ ప్రదర్శించి ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో కోహ్లీ సెంచరీ వృథాగా పోయింది.
విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 53 వన్డే సెంచరీలు చేయగా, అందులో 44 సార్లు భారత్ విజయం సాధించింది. కేవలం 8 సందర్భాల్లో మాత్రమే కోహ్లీ సెంచరీ చేసినా జట్టు ఓటమిపాలైంది (ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు).
107 vs ఇంగ్లాండ్ (కార్డిఫ్, 2011)
123 vs న్యూజిలాండ్ (నేపియర్, 2014)
117 vs ఆస్ట్రేలియా (మెల్బోర్న్, 2016)
106 vs ఆస్ట్రేలియా (కాన్‌బెర్రా, 2016)
121 vs న్యూజిలాండ్ (ముంబై, 2017)
107 vs వెస్టిండీస్ (పూణే, 2018)
123 vs ఆస్ట్రేలియా (రాంచీ, 2019)
102 vs దక్షిణాఫ్రికా (రాయ్‌పూర్, 2025)
వన్డేల్లో ఛేజింగ్‌లో కోహ్లీ రికార్డు మరింత అద్భుతంగా ఉంది. ఛేజింగ్‌లో అతను చేసిన 24 సెంచరీల్లోనూ భారత్ విజయం సాధించడం విశేషం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..