
IND vs SA 4th T20 : భారత్, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని నాలుగో మ్యాచ్ ఎట్టకేలకు రద్దయ్యింది. లక్నోలోని ఇటానా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, మైదానాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు కారణంగా మ్యాచ్ ప్రారంభం కాలేదు. దీనితో మ్యాచ్ అధికారులకు ఇష్టం లేకపోయినా, ఈ కీలకమైన మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది.
వాస్తవానికి, భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ టాస్ భారత సమయం ప్రకారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు జరగాలి. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కావాలి. కానీ, లక్నో మైదానంలో పడిన పొగమంచు కారణంగా టాస్ కూడా సాధ్యపడలేదు. మ్యాచ్ అధికారులు పరిస్థితులు మెరుగుపడతాయనే ఆశతో దాదాపు 6 సార్లు టాస్‌ను వాయిదా వేస్తూ, పలు దఫాలుగా మైదానాన్ని తనిఖీ చేశారు. అయినప్పటికీ క్రీడాకారులు సురక్షితంగా ఆడేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడకపోవడంతో, చివరికి మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు.
ఈ మ్యాచ్ రద్దు కావడంతో సిరీస్‌లో టీమిండియాకు అజేయ ఆధిక్యం సాధించే అవకాశం చేజారింది. ప్రస్తుతం 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమ్ ఇండియా 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐదో, చివరి టీ20 మ్యాచ్‌పై ఇప్పుడు మరింత ఉత్కంఠ నెలకొంది. ఈ చివరి మ్యాచ్‌లోనే సిరీస్ విజేత ఎవరో తేలుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..