IND vs NZ: 2వ టీ20 నుంచి ఛోటా ప్యాకెట్ ఔట్.. ఎంట్రీ ఇవ్వనున్న వైభవ్ సూర్యవంశీ..?

IND vs NZ 2nd T20I: న్యూజిలాండ్‌తో రెండో టీ20కి ముందు టీమిండియాకు కీలక మార్పు తప్పనిసరిగా మారింది. తొలి మ్యాచ్‌లో గాయపడిన ఇషాన్ కిషన్ రెండో మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో ఇప్పటివరకు బెంచ్‌కే పరిమితమైన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు పెరిగాయి. అయితే అతడిని ఆడిస్తారా లేదా అనేది చివరి క్షణంలో తేలనుంది.

IND vs NZ: 2వ టీ20 నుంచి ఛోటా ప్యాకెట్ ఔట్.. ఎంట్రీ ఇవ్వనున్న వైభవ్ సూర్యవంశీ..?
Ind Vs nz 2nd T20i Vaibhav Sooryavanshi

Updated on: Oct 23, 2026 | 3:13 PM

భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand) మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా అక్టోబర్ 24న ఈ మ్యాచ్ జరగనుంది. తొలి టీ20లో అద్భుతమైన విజయాన్ని అందుకున్న టీమిండియా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. అయితే రెండో మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. బీసీసీఐ ప్రకారం.. అతడి కుడి తొడ కండరాల్లో స్వల్ప స్థాయి గాయం అయింది. ప్రస్తుతం మెడికల్ టీమ్ అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.

ఇషాన్ కిషన్ అందుబాటులో లేకపోవడంతో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) పేరు మరోసారి తెరపైకి వచ్చింది. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. అంతకుముందు కూడా వరుసగా కొన్ని సిరీస్‌ల్లో అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు ఇషాన్ గాయం అతడికి మరో అవకాశాన్ని తెచ్చిపెట్టింది.

టీమిండియా బ్యాటింగ్ కోచ్ సీతాంశు కోటక్ కూడా వైభవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేదు. ఇషాన్ గాయం కారణంగానే తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు జరిగిందని ఆయన స్పష్టం చేశారు. రెండో మ్యాచ్‌లో ఇషాన్ ఆడే అవకాశం లేదని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో వైభవ్ బలమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు.

అయితే వైభవ్ జట్టులోకి వస్తే ఓపెనింగ్ కాంబినేషన్‌లో మార్పు చేయాల్సి ఉంటుంది. అభిషేక్ శర్మ (Abhishek Sharma), సంజు శాంసన్ (Sanju Samson) ప్రస్తుతం భారత జట్టు ఓపెనర్లుగా ఉన్నారు. తొలి టీ20లో సంజు శాంసన్ కేవలం 33 బంతుల్లోనే 67 పరుగులు చేసి టీమిండియా విజయానికి కీలకంగా నిలిచాడు. దీంతో అతడిని ఓపెనింగ్ నుంచి తప్పించి మూడో స్థానంలో ఆడించే అవకాశం ఉంది. మరోవైపు వైభవ్, అభిషేక్ కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. అయితే కోటక్ వ్యాఖ్యలను బట్టి టీమ్ కాంబినేషన్ ఆధారంగానే తుది నిర్ణయం తీసుకోనున్నారు.

వైభవ్ సూర్యవంశీకి అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే మంచి రికార్డు ఉంది. భారత్ తరఫున ఇప్పటివరకు ఎనిమిది టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ యువ ఎడమచేతి బ్యాటర్ 246 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 186.37గా ఉంది. ఖాతాలో రెండు అర్ధశతకాలు కూడా ఉన్నాయి. 2026 ఐపీఎల్‌లో 776 పరుగులతో అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్.. తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని ఇప్పటికే నిరూపించుకున్నాడు.

మరోవైపు తొలి టీ20లో భారత్ 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. సంజు శాంసన్ 67 పరుగులతో అదరగొట్టగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), అక్షర్ పటేల్ (Axar Patel), నామన్ ధీర్ (Naman Dhir) కూడా కీలక సహకారం అందించారు. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో ఇషాన్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

వైభవ్‌కు అవకాశం వస్తే ఇది అతడి కెరీర్‌లో మరో కీలక మలుపు కావొచ్చు. అయితే ఇప్పటికైతే అతడి ఎంపిక ఖరారైందని చెప్పలేం. ఇషాన్ స్థానంలో వైభవ్‌తో పాటు ఇతర కాంబినేషన్లను కూడా టీమ్ మేనేజ్‌మెంట్ పరిశీలించే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి వచ్చే బలమైన పోటీదారుల్లో ఒకడిగా ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us