
India vs New Zealand 1st T20I: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ ముగిసిన వెంటనే, జనవరి 21 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. నాగ్‌పూర్ వేదికగా జరగనున్న తొలి పోరు కోసం టీమ్ ఇండియా వ్యూహాలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ 2026కు ముందు జరుగుతున్న చివరి మేజర్ సిరీస్ కావడంతో, టీమ్ మేనేజ్‌మెంట్ కీలక మార్పులు చేస్తోంది. ఇందులో ప్రధానంగా రెండేళ్ల విరామం తర్వాత ఒక స్టార్ ప్లేయర్ జట్టులోకి రావడం విశేషం.
న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్ కోసం భారత సెలక్షన్ కమిటీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. గాయం కారణంగా దూరమైన తిలక్ వర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను జట్టులోకి ఆహ్వానించారు.
శ్రేయస్ అయ్యర్ పునరాగమనం: అయ్యర్ తన చివరి టీ20 మ్యాచ్‌ను డిసెంబర్ 2023లో ఆడాడు. ఆ తర్వాత ఫామ్, గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అయితే, ఐపీఎల్ 2025లో అద్భుత ప్రదర్శన, దేశీవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించడంతో గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ స్టాఫ్ అతనికి మళ్లీ అవకాశం కల్పించింది. తొలి టీ20లో అయ్యర్ నంబర్ 4లో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.
ఓపెనింగ్ జోడీ: రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత ఓపెనింగ్ బాధ్యతలను అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ చేపట్టనున్నారు. పవర్‌ప్లేలో మెరుపు వేగంతో పరుగులు రాబట్టడంలో వీరిద్దరూ దిట్ట. నంబర్ 3లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు వస్తారు.
ఆల్‌రౌండర్ల సందడి: జట్టులో డెప్త్ పెంచేందుకు హార్దిక్ పాండ్యా, శివం దూబే మరియు వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌లు ఫిక్స్ అయ్యారు. వీరు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ కీలక పాత్ర పోషించనున్నారు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ కంటే రవి బిష్ణోయ్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే అతను బ్యాటింగ్ కూడా చేయగలడు.
బౌలింగ్‌లో ఊహించని మార్పులు: అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, టీ20లలో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్‌ను పక్కన పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కోచ్ గంభీర్ అతని స్థానంలో హర్షిత్ రాణాను ఆడించాలని చూస్తున్నారు. హర్షిత్ లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగలగడం అతనికి ప్లస్ పాయింట్. ఇక పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా జట్టుకు ప్రధాన బౌలర్‌గా ఉంటారు.
తొలి టీ20 కోసం భారత్ సంభావ్య ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.