
Abhishek Sharma sets new world record: టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ కొత్త ఏడాదిని గ్రాండ్ గా మొదలుపెట్టాడు. తొలిసారి గ్రౌండ్ లోకి దిగి సరికొత్త చరిత్ర సృష్టించాడు. నాగ్‌పూర్‌లో జనవరి 21న న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ20ఐ మ్యాచ్‌లో వీరవిహారం చేశాడు. అభిషేక్ శర్మ కేవలం 35 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్లతో 84 పరుగులతో బీభత్సం సృష్టించాడు. ఈ క్రమంలో భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 238 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ టీంను కేవలం 190 పరుగులకే పరిమితం చేసింది. దీంతో అభిషేక్ శర్మ టీమిండియా విజయంలో హీరోగా నిలిచాడు. అతను విధ్వంసకరంగా బ్యాటింగ్ తో బౌలర్లకు చుక్కలు చూపించాడు.

ఓపెనర్ గా బరిలోకి వచ్చిన అభిషేక్ శర్మ.. తొలి బంతి నుంచే అటాకింగ్ మొదలుపెట్టాడు. ఈ క్రమంలో 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా ప్లేయర్ సాధించిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇదే కావడం గమనార్హం. ఈ క్రమంలో ఈ యంగ్ గన్ ఓ ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ లాంటి దిగ్గజాలు కూడా తమ టీ20 కెరీర్ లో ఇలాంటి రికార్డ్ ను సాధించలేదు.

టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 5,000 పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ కొత్త ప్రపంచ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం 2,898 బంతుల్లోనే ఐదువేల పరుగులు సాధించాడు. గతంలో ఈ రికార్డు ఆండ్రీ రస్సెల్ పేరిట ఉంది. కేవలం 2,942 బంతుల్లో 5,000 పరుగుల క్లబ్ లో చేరాడు.

టీ20 క్రికెట్‌లో తక్కువ బంతుల్లో 5000 పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరో ఓసారి చూద్దాం. 1. 2898 బంతుల్లో అభిషేక్ శర్మ, 2. 2942 బంతుల్లో ఆండ్రీ రస్సెల్, 3. 3127 బంతుల్లో టిమ్ డేవిడ్, 4. 3196 బంతుల్లో విల్ జాక్స్, 5. 3239 బంతుల్లో గ్లెన్ మాక్స్వెల్ ఉన్నారు.

అభిషేక్ శర్మ ప్రస్తుతం ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాట్స్‌మన్ గా నిలిచాడు. 2026లో తన తొలి మ్యాచ్‌లోనే అభిషేక్ శర్మ 8 సిక్సర్లు బాదాడు. ఈ యువ ఆటగాడు ఇప్పుడు 34 టీ20 మ్యాచ్‌ల్లో 190.93 స్ట్రైక్ రేట్‌తో 1199 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.