WTC Final: 10 ఏళ్లలో 8 సార్లు.. లక్కీ కెప్టెన్‌గా ధోనీ.. బ్యాడ్ లక్ సారథిగా విరాట్.. ఇక రోహిత్ ఏం చేస్తాడో?

|

Jun 04, 2023 | 11:10 AM

WTC Final 2023 Ind vs Aus: రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు మిషన్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 కోసం ఇంగ్లాండ్‌ చేరుకంది. గత 10 ఏళ్లుగా ప్రతీ భారతీయ క్రికెట్ అభిమాని ఎదురుచూస్తోన్న కలల ఐసీసీ ట్రోఫీని రోహిత్ శర్మ సేన అందుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

WTC Final: 10 ఏళ్లలో 8 సార్లు.. లక్కీ కెప్టెన్‌గా ధోనీ.. బ్యాడ్ లక్ సారథిగా విరాట్.. ఇక రోహిత్ ఏం చేస్తాడో?
Dhoni Kohli Rohit
Follow us on

WTC Final 2023 Ind vs Aus: రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు మిషన్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 కోసం ఇంగ్లాండ్‌ చేరుకంది. గత 10 ఏళ్లుగా ప్రతీ భారతీయ క్రికెట్ అభిమాని ఎదురుచూస్తోన్న కలల ఐసీసీ ట్రోఫీని రోహిత్ శర్మ సేన అందుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది. 2013 సంవత్సరంలో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో చివరి ఐసీసీ టైటిల్‌ను గెలుచుకుంది. అయితే, ఆ తర్వాత టీమిండియా ఏ ఐసీసీ టైటిల్‌ను గెలుచుకోలేదు. 2013 నుంచి భారత జట్టు అనేక ప్రధాన టోర్నమెంట్లలో ట్రోఫీకి చేరువైంది. కానీ, దక్కించుకోలేకపోయింది. ఈసారి రోహిత్ శర్మ ఆ కరువును అంతం చేయగలడని భావిస్తున్నారు.

10 ఏళ్లలో టీమ్ ఇండియా 8 సార్లు..

ప్రతి ICC టోర్నమెంట్‌ను గెలవడానికి భారత క్రికెట్ జట్టు ఫేవరెట్‌గా పరిగణిస్తుంటారు. అయితే 2013 తర్వాత కీలక సందర్భాల్లో విఫలమైంది. 2013 తర్వాత ఆడిన టీ20 ప్రపంచకప్‌తో మొదలైన ఓటముల ఒరవడి.. 2014లో టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరింది. అయితే శ్రీలంక చేతిలో భారత జట్టు పరాజయం పాలైంది. ఆ తర్వాత 2015 వన్డే ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. అయితే అక్కడ ఆస్ట్రేలియా రూపంలో టీమ్ ఇండియాకు ఓటమి ఎదురైంది.

2016లో మరోసారి టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్‌కు చేరుకోగా, వెస్టిండీస్ రూపంలో మార్గం మూతపడింది. ఆ తర్వాత 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టీమిండియా ICC టైటిల్‌ను గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయింది. ఆ తరువాత 2019 సంవత్సరంలో టీం ఇండియా మంచి ప్రదర్శన చేసి ODI ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. అయితే న్యూజిలాండ్ భారత జట్టుకు విలన్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో టీమిండియా ప్రయాణం ముగిసింది.

ఇవి కూడా చదవండి

అయితే 2021 సంవత్సరంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో, భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మొదటి ఎడిషన్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ, అక్కడ కూడా భారత్‌ను ఓడించిన కివీ జట్టు ఛాంపియన్ కావాలనే కలను విచ్ఛిన్నం చేసింది. ఆ తరువాత, 2022 సంవత్సరంలో, రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2022 సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఇంగ్లాండ్ జట్టు భారత్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించి ఏకపక్షంగా మ్యాచ్‌ను గెలుచుకుంది.

ఇక తాజాగా 2021-23 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రూపంలో రోహిత్ సేనకు మరో అవకాశం వచ్చింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో, గత పదేళ్ల కరువును తీర్చే ఛాన్స్ ఉంది. ఇంగ్లండ్ వేదికగా జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ ముందు కంగారూ జట్టు నిలిచింది. టీమిండియా టెస్టు ఛాంపియన్‌గా నిలుస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ జూన్ 7 నుంచి జూన్ 11 వరకు లండన్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతుంది. దాని కోసం రిజర్వ్ డే కూడా ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..