అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4వ టెస్టులో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సృష్టించాడు. అది కూడా ఫీల్డింగ్ ద్వారానే కావడం విశేషం.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 480 పరుగులు చేసి ఆలౌటైంది. 9వ స్థానంలో వచ్చిన నాథన్ లియాన్.. అశ్విన్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.
లియాన్ ఇచ్చిన క్యాచ్ పట్టడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 300 క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ చేరాడు. విశేషమేమిటంటే.. టీమిండియా తరపున రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఘనత సాధించడం గమనార్హం.
టీమిండియా తరపున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ద్రవిడ్ 509 మ్యాచ్‌ల్లో మొత్తం 334 క్యాచ్‌లు అందుకున్నాడు. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో 300కు పైగా క్యాచ్‌లు పట్టిన 5వ ఆటగాడిగా నిలిచాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ప్రపంచ రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే పేరిట ఉంది. జయవర్ధనే 652 మ్యాచ్‌ల్లో 440 క్యాచ్‌లతో ప్రపంచ రికార్డు సృష్టించాడు.
విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 494 మ్యాచ్‌ల ద్వారా 300 క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన 2వ భారత ఆటగాడిగా, ప్రపంచంలో 7వ క్రికెటర్‌గా కింగ్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.