నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా ఆటగాళ్లు కఠోర సాధన చేస్తున్నారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ దృష్ట్యా ఈ సిరీస్ కూడా చాలా కీలకం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు టీమిండియా ప్లేయర్లో టెన్షన్ పెరిగింది. రోహిత్ శర్మ ఆడుతాడా లేదా అని ఇప్పటికే ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఓ స్టార్ ఆటగాడు కూడా గాయపడ్డాడు. ఈ ఆటగాడు తొలి టెస్టుకు కూడా దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.
భారత స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్ గాయపడ్డాడు. పెర్త్‌లో ఇండియా ఎతో జరిగిన మ్యాచ్‌లో వేలికి గాయమైనట్లు తెలుస్తుంది. మ్యాచ్ సమయంలో స్లిప్ క్యాచ్ తీసుకుంటుండగా శుభమాన్ గిల్ వేలికి గాయమైంది. ఈ గాయం తీవ్రంగా ఉందని, దీని కారణంగా అతను పెర్త్ టెస్టులో ఆడటం కష్టమే అని తెలుస్తుంది. వైద్య బృందం అతడిపై నిఘా ఉంచిందని, తొలి మ్యాచ్‌లో పాల్గొంటాడా లేదా అనేది త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
నవంబర్ 14న WACAలో భారత్ ప్రాక్టీస్ సెషన్‌లో నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు యువ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ మోచేయికి గాయమైంది. దీంతో అతను ఈరోజు ప్రాక్టిస్ సెషన్లో కొంత అసౌకర్యంగా కనిపించాడు. కేఎల్ రాహుల్ కూడా ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డాడు. నవంబర్ 15న సెంటర్ వికెట్ మ్యాచ్ సిమ్యులేషన్ సమయంలో రాహుల్ కుడి మోచేయికి గాయమైంది. ఆ తర్వాత బ్యాటింగ్ కూడా చేయలేదు. విరాట్ కోహ్లి కూడా గాయం కాగా, కానీ స్కాన్ తర్వాత అతను పూర్తిగా క్షేమంగా ఉన్నట్లు తెలిసింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టులో భాగమవుతాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. రోహిత్ ఆడకపోతే ఓపెనింగ్ బాధ్యతలు కేఎల్ రాహుల్‌కి దక్కవచ్చు. కాగా, శుభ్‌మన్ గిల్ మూడో స్థానంలో ఆడుతున్నాడు. అటువంటి పరిస్థితిలో గిల్‌కి గాయపడటం టీమిండియా ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూసే అని చెప్పాలి.