‘వాళ్లు నన్ను చంపేస్తారు’..: పీసీబీ ఛీప్‌పై ఇమ్రాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్..

Mohsin Naqvi threats allegations: అసలే టీ20 ప్రపంచకప్ 2026లో పాక్ జట్టు ఓటమితో పీసీబీ ఛీప్ మొహ్సిన్ నక్వీ తెగ ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ విషయంలోనూ తలదూర్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఆయన సోదరీమణులు తాజాగా చేసిన ఈ ఆరోపణలతో నఖ్వీకి కొత్త తలనొప్పిలా మారాయి.

వాళ్లు నన్ను చంపేస్తారు..: పీసీబీ ఛీప్‌పై ఇమ్రాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్..
Imran Khan, Mohsin Naqvi

Updated on: Feb 18, 2026 | 2:04 PM

Mohsin Naqvi threats allegations: పాకిస్తాన్ మాజీ ప్రధాని, క్రికెట్ లెజెండ్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉండగా, అతని ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి అంతగా దిగజారిందని చెబుతూ, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, గ్రెగ్ చాపెల్, క్లైవ్ లాయిడ్ వంటి మాజీ అంతర్జాతీయ కెప్టెన్లు పాకిస్తాన్ ప్రభుత్వానికి సంయుక్త విజ్ఞప్తి చేశారు. “క్రికెట్ ఐకాన్ అయిన ఇమ్రాన్ ఖాన్‌కు న్యాయమైన వైద్యం, గౌరవప్రదమైన వ్యవహారం కల్పించాలి” అని వారు కోరారు. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్, పీసీబీ చైర్మన్ అయిన మొహ్సిన్ నక్వీ తమను బెదిరిస్తున్నాడని ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు ఆరోపించారు.

మొహ్సిన్ నక్వీ నుంచి బెదిరింపులా?

ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు డా. ఉజ్మా ఖాన్, అలీమా ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. మొహ్సిన్ నక్వీతో పాటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కలిసి తమ అన్న ఇమ్రాన్ ఖాన్‌ను హతమార్చే కుట్ర పన్నుతున్నారని వారు పేర్కొన్నారు. ఇటీవల జైలులో జరిగిన భేటీలో ఇమ్రాన్ ఖాన్ స్వయంగా తన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పాడని వారు తెలిపారు.

“వాళ్లు నన్ను చంపేస్తారు; నన్ను చంపడానికి ప్లాన్ చేసుకున్నారు” అని అన్న మాటలను ఉజ్మా ఖాన్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

అలీమా ఖాన్ మాట్లాడుతూ, ఇమ్రాన్ ఖాన్ కంటి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని, అయినా అతనికి నమ్మకమైన వైద్య బృందాన్ని కలుసుకునే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు.

“మొహ్సిన్ నక్వీ మమ్మల్ని బెదిరిస్తున్నాడు; వాళ్లకు రక్తం రుచి చూసినట్టైంది. ఇమ్రాన్ ఖాన్‌కైనా, మాకైనా ఏదైనా జరిగితే – మాట ఇస్తున్నా – ఎవరి భవిష్య తరాలను కూడా వదిలిపెట్టం” అని అలీమా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యక్తిగత వైద్యులతో పరీక్షించాలన్న విజ్ఞప్తికి నిరాకరణ..

ఇమ్రాన్ ఖాన్‌ను అతని వ్యక్తిగత వైద్యులు డా. ఆసిమ్, డా. ఫైసల్‌లతో పరీక్షించాలని సోదరీమణులు కోరగా, ప్రభుత్వ వర్గాలు ఆ అభ్యర్థనను తిరస్కరించాయని తెలిపారు.

“మా డాక్టర్లు సూచించిన స్పెషలిస్టులను ప్రభుత్వం తిరస్కరించింది. ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వమన్నారు. ఆపై కుటుంబ ప్రతినిధిగా మా బంధువు నౌషెర్వాన్ బుర్కీ పేరును ప్రతిపాదించాం. దాన్నీ తిరస్కరించారు. ఇది అసలు అంగీకరించదగినది కాదు” అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ప్రపంచవ్యాప్తంగా నిరసన స్వరం పెరుగుతోంది. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్‌లతో పాటు వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్ వంటి పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజాలు కూడా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వెంటనే స్పందించి, మాజీ ప్రధాని ఆరోగ్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us