
ప్రపంచ కప్ 2023లో భాగంగా టీమ్ ఇండియా తదుపరి మ్యాచ్ న్యూజిలాండ్‌తో జరుగుతుంది. ఆదివారం (అక్టోబర్ 22) ధర్మశాల వేదికగా ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్రపంచ కప్ పాయింట్ల జాబితాలో నంబర్ 1 స్థానాన్ని పొందుతుంది. దీనికి తోడు ఇరు జట్లు బలంగా ఉన్నాయి. కాబట్టి హోరాహోరీ పోరు తప్పదని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే న్యూజిలాండ్ క్రికెటర్ల వేతనాలకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. భారత ఆటగాళ్లతో పోలిస్తే న్యూజిలాండ్ క్రికెటర్లకు చాలా తక్కువ జీతం లభిస్తుంది. సెంట్రల్ కాంట్రాక్టుకు మ్యాచ్ ఫీజుకు జీతంలో వ్యత్యాసం భారీగా ఉంది. భారత క్రికెట్ బోర్డు తన ఆటగాళ్లను నాలుగు కేటగిరీలుగా విభజిస్తుంది. ఒక్కో కేటగిరీ వేతనాలు భిన్నంగా ఉంటాయి. మరోవైపు, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులో ఎటువంటి కేటగిరీలు ఉండవు. అక్కడ క్రీడాకారులకు ర్యాంక్ ఇస్తారు. దీని ప్రకారమే క్రికెటర్లందరికీ వేతనాలు చెల్లిస్తారు.
భారత్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా లాంటి దిగ్గజ ఆటగాళ్లు ‘ఎ+’ విభాగంలో ఉన్నారు. వీరికి ఏటా రూ.7 కోట్లు అందుతున్నాయి. మరోవైపు, న్యూజిలాండ్ టాప్ ర్యాంక్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ వార్షిక వేతనం 5,23,396 న్యూజిలాండ్ డాలర్లు (రూ. 2.5 కోట్లు). ఇక టీమిండియాలో A, B, C కేటగిరీ క్రీడాకారులు సంవత్సరానికి వరుసగా రూ. 5 కోట్లు, 3 కోట్లు, కోటి పొందుతారు. మరోవైపు కివీస్ ఆటగాళ్ల జీతం ఒక్కో ర్యాంక్‌తో తగ్గుతుంది. ఉదాహరణకు, పదో ర్యాంక్‌లో ఉన్న ఆటగాడి వార్షిక వేతనం 4,44,196 న్యూజిలాండ్ డాలర్లు (రూ. 2.15 కోట్లు). ఇరు జట్ల క్రికెటర్ల మ్యాచ్ ఫీజులో కూడా భారీ వ్యత్యాసం ఉంది. భారత క్రికెటర్లు టెస్టుకు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20కి రూ.3 లక్షలు అందుకుంటారు. మరోవైపు న్యూజిలాండ్ క్రికెటర్లు టెస్టుకు రూ.5 లక్షలు, వన్డేకు రూ.2 లక్షలు, టీ20కి రూ.1.20 లక్షలు మాత్రమే అందుకుంటారు. అయితే వేతనాలు తక్కువైనా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌ను న్యూజిలాండ్ శాసిస్తోంది. మూడు ఫార్మాట్లలో బలమైన జట్టుగా అవతరించింది. ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లోనూ ఆ జట్టు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. వరుస విజయాలతో దూసుకెళుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..