India Vs Australia Final: అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. టీమ్ ఇండియా అన్‌స్టాపబుల్.. తగ్గదేలే..

India Vs Australia Final World Cup 2023: ఫైనల్లో భారత్‌ ఎలా ఆడబోతోందో తెలియాలంటే.. మన ట్రాక్‌ రికార్డును ఓసారి చూసుకోవాలి. అంతేకాదు.. కెప్టెన్సీ బలాన్నీ బేరీజు వేయాలి. 1983లో ఏం జరిగింది.. 2011 వరల్డ్‌కప్‌ గెలవడంతో నాయకుడి మేధస్సు ఎలా ఉపయోగపడింది? ఇప్పుడు కెప్టెన్‌ ఎలా పెర్ఫామ్‌ చేస్తున్నాడు. నిజానికి ముగ్గురిలో ఉన్న కామన్‌ పాయింట్‌.. కూల్‌ అండ్‌ కామ్‌నెస్‌. అదే ఈరోజు మనల్ని జగజ్జేతగా నిలబెడుతుందా?

India Vs Australia Final: అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. టీమ్ ఇండియా అన్‌స్టాపబుల్.. తగ్గదేలే..
Team India

Updated on: Nov 19, 2023 | 11:28 AM

India Vs Australia Final World Cup 2023: ఒకప్పుడు టీమిండియా అన్‌ ప్రెడిక్టబుల్‌.. ఇప్పుడు భారత జట్టు.. అన్‌స్టాపబుల్‌.. ఒకప్పుడు బౌలింగ్‌ బలం తక్కువే.. ఇప్పుడు బలం, బలగం రెండూ ఎక్కువే.. ఆ టైమ్‌లో ఒత్తిడికి తలొగ్గేశారు.. ఇప్పుడు ఒత్తిడినే వంచిపడేస్తారు.. అదీ అప్పటి టీమ్‌ ఇండియా.. ఇప్పుడు భారత జట్టుకున్న తేడా. వరల్డ్‌ కప్‌ చరిత్ర మొదలైన దగ్గర్నుంచి.. అంటే 1975నుంచి ఇప్పటివరకు రెండంటే రెండే సార్లు భారత్ నెగ్గింది. 1983లో తొలిసారి.. 2011లో రెండోసారి గెలిచింది భారత్‌. మిగిలిన టోర్నీలో చేతులెత్తేసింది. 2003లో టైటిల్ గెలిచేంత చేసినా.. ఫైనల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. భారత్‌కు కప్‌ అందించిన ఆ ఇద్దరు కెప్టెన్లు ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో నిలిచిపోయారు. అనామక జట్టుని… కేవలం డార్క్‌ హార్స్‌గా బరిలోకి దిగారని పేరున్న అప్పటి జట్టుని చాంపియన్‌గా నిలిపాడు కపిల్‌ దేవ్‌. ఆయన కెప్టెన్సీ అమోఘం. అసలు గెలవడమే తెలియని ఆ జట్టుని.. జగజ్జేతగా నిలపడం అద్భుతం. ఆతర్వాత భారత్‌లో క్రికెట్‌ ముఖచిత్రమే మారిపోయింది. జెంటిల్మన్‌గేమ్‌ కాస్తా.. మాస్‌ గేమ్‌గా మారింది.

అప్పటినుంచి భారత జట్టుపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని 1987, 1992, 1996, 1999 ఇలా వరుసగా నిరాశాజనక ప్రదర్శనలే ఇస్తూ వచ్చింది టీమ్‌. 2003లో ఫైనల్‌ వరకు వెళ్లినా గెలవలేకపోయాం. 2007లో అయితే అత్యంత దారుణంగా గ్రూప్‌స్టేజ్‌ నుంచి వెనుదిరిగి అసలు భారత్‌ పనైపోయిందన్న అపవాదును మూటగట్టుకుంది. కాని 2011లో మిరాకిల్‌ జరిగింది. 2007 ఓటమి తర్వాత పగ్గాలందుకున్న మహేంద్ర సింగ్‌ ధోనీ.. జట్టును నడిపించిన తీరు అద్భుతం. ఓవైపు సీనియర్లు, ఇంకోవైపు జూనియర్లను కలగలుపుకుని.. టీమ్‌ను విజయాల వైపు నడిపించాడు ధోనీ. అప్పటికే 2007 టీ20 వరల్డ్‌ కప్‌ను గెలిపించాడు. దీంతో 2011 వరల్డ్‌కప్‌ కూడా గెలుస్తుందన్న ధీమా ఏర్పడింది. కాని ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా కంటి మేటి జట్లను ఎలా దారికి తెచ్చుకోవాలనేది కేవలం ధోనీ వ్యూహాలతోనే సాధ్యపడింది. ఫైనల్లో టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలిన సమయంలో ధోనీ ఇన్నింగ్సే హైలైట్‌గా నిలిచింది. చివర్లో సిక్స్‌ కొట్టి జట్టుకు వరల్డ్‌కప్‌ను తీసుకొచ్చి పెట్టాడు మహేంద్ర సింగ్‌ ధోనీ.

2011 విజయం తర్వాత జరిగిన రెండు వరల్డ్‌కప్‌లలోనూ సెమీస్‌ వరకు వచ్చి వెనుదిరిగాం. ఈసారి మాత్రం అలా జరగలేదు. సెమీస్‌ గండాన్ని దాటి.. ఫైనల్లోకి వచ్చి చేరాం. 1983, 2003, 2011, 2023 ఇలా నాలుగో సారి ఫైనల్లో అడుగుపెట్టింది టీమిండియా. అయితే ఈ సారి విజయాల వెనుక రోహిత్‌ శర్మ కెప్టెన్సీ బ్రిలియన్స్‌ గురించి ముమ్మాటికీ చెప్పుకోవాల్సిందే. ఈ టోర్నీలో భారత్‌ అప్రతిహిత విజయాలను నమోదు చేస్తూ వచ్చింది. తొలి మ్యాచ్‌ నుంచి సెమీఫైనల్‌ అయిన పదో మ్యాచ్‌ వరకు వరుస విజయాలు నమోదు చేసింది. 48 ఏళ్ల వరల్డ్‌కప్‌ చరిత్రలో భారత్‌ ఎన్నడూ వరుసగా నెగ్గింది లేదు. ఈసారి గెలిచిందంటే.. రోహిత్‌ శర్మ ఏ రేంజ్‌లో జట్టుని నడిపిస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. ఈ టోర్నీలో ట్రికీ మ్యాచ్‌లు అంటే.. తొలి మ్యాచ్‌ ఆస్ట్రేలియా, ఆతర్వాత ఇంగ్లండ్‌తొ మ్యాచ్‌, కివీస్‌తో అటు గ్రూప్‌ మ్యాచ్‌.. ఇటు సెమీస్‌ ఫైట్‌ చాలా టఫ్‌గా సాగాయి. కాని రోహిత్‌ వ్యూహాలను అమలు చేసిన తీరే.. ఈ మ్యాచ్‌లలో విజయానికి సోపానాలుగా మారాయి. బౌలర్‌లను సరైన సమయానికి మార్చడం.. ఫీల్డింగ్‌ సెటప్‌, స్పిన్‌ను సమర్ధంగా వినియోగించుకోవడం.. బ్యాటర్లలో ఉత్సాహాన్ని నింపడం.. ముఖ్యంగా డ్రెస్సింగ్‌ రూమ్‌లో అందర్నీ కలుపుకుని పోవడం వల్లే.. ఈ విజయాలు దక్కాయి. అంతేకాదు.. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో రోహిత్‌కు మంచి అనుబంధం ఉంది. ఈ ఇద్దరూ కలిసి భారత్‌ను జగజ్జేతగా నిలుపుతారన్న నమ్మకం అభిమానుల్లో పూర్తిగా ఉంది.

లైవ్ స్కోర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..