గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది.. ఈ డైలాగ్ ఆస్ట్రేలియా జట్టుకు బాగా సూట్ అవుతుంది. వన్డే వరల్డ్‌కప్ 2023 లీగ్ స్టేజిని వరుసగా రెండు ఓటములతో ప్రారంభించింది ఆస్ట్రేలియా. తొలి పోరులో భారత్ చేతిలో ఓడిపోయిన ఆసీస్.. రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓటమిపాలైంది.
ఆ సమయంలో ఆస్ట్రేలియాపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. రెండు మ్యాచ్‌లతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న ఆసీస్.. బౌలింగ్ లైనప్, బ్యాటింగ్ లైనప్ రెండూ వీకేనని.. టాప్ 4కి అస్సలు అర్హులు కాదని పేలవంగా జోక్స్ వేశారు. అయితేనేం.. అవేం పట్టించుకోని ఆస్ట్రేలియా జట్టు.. తమ బెస్ట్ పెర్ఫార్మన్స్ మున్ముందు రానుందని చెప్పడమే కాదు.. వరుసగా 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించి 14 పాయింట్లతో టాప్-4లోకి దూసుకుపోయింది. అలాగే ఆఫ్గనిస్తాన్ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీ అమోఘమని యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసలు కురిపించింది.
ఇదిలా ఉంటే.. రెండో సెమీఫైనల్‌లో బలమైన దక్షిణాఫ్రికా జట్టును కేవలం 212 పరుగులకే ఆలౌట్ చేసి.. అనంతరం 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. అలాగే ఫైనల్‌లో భారత్‌తో తలపడి.. 6 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా.. 6వ సారి విశ్వవిజేతగా నిలిచింది. ఇలా లీగ్ స్టేజిలో వరుసగా రెండు ఓటములు ఎదుర్కున్న ఆస్ట్రేలియా.. ఆ తర్వాత ట్రిపుల్ హ్యాట్రిక్ విజయాలు అందుకుని ట్రోఫీని ఎగరేసుకునిపోయింది. లీగ్ దశలో భారత్, దక్షిణాఫ్రికా చేతిలో ఎదుర్కున్న పరాభవానికి.. సరిగ్గా నెల రోజుల్లోనే ప్రతీకారాన్ని తీర్చుకుంది. మరీ ఎట్లానంటే.. ఈ రెండు జట్లలలో ఎవరికొకరికి కప్ దక్కుతుందని అందరూ భావించినా.. ఆసీస్ పూర్తిగా దాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆఖరి ఫైట్‌లో టీమిండియాను ఓడించి.. ఇండియన్ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లింది. కాగా, ఫైనల్‌లో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(137) అద్భుతమైన సెంచరీ సాధించాడు. అతడు మార్నస్ లబూషెన్(58)తో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. ఆస్ట్రేలియా జట్టు విశ్వవిజేతగా నిలిపాడు.
లీగ్ స్టేజిలో రెండు ఓటముల అనంతరం పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ చెప్పకనే చెప్పాడు. ‘సఫారీలతో ఆస్ట్రేలియా ఓడిపోతే.. ఈ పగనంతటిని.. టోర్నమెంట్ అంతా తీర్చుకుంటుందని’ ట్వీట్ చేశాడు. సరిగ్గా అదే జరిగింది. టీమిండియా ట్రోఫీ ఆశలను అడియాశలు చేస్తూ.. వరల్డ్‌కప్ ఎత్తుకెళ్లింది.
If Australia lose today, yeh baqi ka poora tournament sab pay ghussa nikaalay gi!
Soch lain what you want— Shoaib Akhtar (@shoaib100mph) October 12, 2023
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..