ICC T20I Rankings: ఏకంగా 32 మందిని తొక్కేస్తూ దూసుకొచ్చిన యువ కెరటం.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పెను సంచలనం

ICC T20I Rankings: టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందు ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ భారత క్రికెట్‌లో పెను సంచలనం సృష్టించాయి. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన కుర్రాళ్లు ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతుంటే, మరికొందరు స్టార్ ప్లేయర్లు మాత్రం పాతాళానికి పడిపోయారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ ఏకంగా 32 మందిని వెనక్కి నెట్టి తన సత్తా చాటగా, సంజూ శామ్సన్ పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది.

ICC T20I Rankings: ఏకంగా 32 మందిని తొక్కేస్తూ దూసుకొచ్చిన యువ కెరటం.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పెను సంచలనం
Ishan Kishan

Updated on: Feb 04, 2026 | 4:24 PM

ICC T20I Rankings: న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్ అతని కెరీర్‌నే మలుపు తిప్పింది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో కెరీర్‌లో మొదటి అంతర్జాతీయ టీ20 సెంచరీ బాదిన ఇషాన్, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 32 స్థానాలు ఎగబాకి 32వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. వరల్డ్ కప్‌లో భారత్ తరఫున ఓపెనర్‌గా ఎవరు ఆడాలనే చర్చకు ఇషాన్ తన బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. మరోవైపు శివం దూబే కూడా 17 మందిని వెనక్కి నెట్టి 41వ స్థానానికి చేరుకుని ఆశ్చర్యపరిచాడు.

చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన సంజూ శామ్సన్‌కు కివీస్ సిరీస్ ఒక గోల్డెన్ ఛాన్స్. కానీ ఐదు మ్యాచ్‌ల్లోనూ సంజూ కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. దీని ప్రభావం అతని ర్యాంకింగ్‌పై తీవ్రంగా పడింది. గత వారంలో 51వ స్థానంలో ఉన్న సంజూ, ఇప్పుడు 56వ ర్యాంక్‌కు పడిపోయాడు. వరల్డ్ కప్ తుది జట్టులో సంజూకు చోటు దక్కడం ఇప్పుడు కష్టంగానే కనిపిస్తోంది. తిలక్ వర్మ కూడా ఒక స్థానాన్ని కోల్పోయి ప్రస్తుతం నాలుగో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

టీ20ల్లో భారత్ కొత్త సెన్సేషన్ అభిషేక్ శర్మ తన నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. 917 రేటింగ్ పాయింట్లతో అతను ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఇక టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ కివీస్ సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచినందుకు ప్రతిఫలం దక్కింది. అతను 7వ స్థానం నుంచి 6వ స్థానానికి ఎగబాకాడు. వరల్డ్ కప్ నాటికి సూర్య మళ్లీ టాప్-3లోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

బౌలింగ్ విభాగంలో భారత్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన నంబర్ వన్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. అయితే, పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ నుంచి అతనికి గట్టి పోటీ ఎదురవుతోంది. అబ్రార్ తాజాగా రెండు స్థానాలు మెరుగుపరుచుకుని రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. వరుణ్ మరియు అబ్రార్ మధ్య కేవలం 28 రేటింగ్ పాయింట్ల తేడా మాత్రమే ఉంది. రాబోయే వరల్డ్ కప్ మ్యాచ్‌లలో వీరిద్దరి మధ్య నంబర్ వన్ స్థానం కోసం హోరాహోరీ పోరు సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి