IND vs ENG : ఇంగ్లాండ్‌తో రెండో వన్డేకు ముందు టీమిండియాకు షాక్.. యంగ్ బౌలర్ పై ఐసీసీ చర్యలు

IND vs ENG : ఇంగ్లాండ్‌తో రెండో వన్డేకు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. తొలి వన్డేలో నిబంధనల ఉల్లంఘనకు గుర్నూర్ బ్రార్‌పై ఐసీసీ డిమెరిట్ పాయింట్ విధించింది. కార్డిఫ్ వేదికగా జరిగే కీలక పోరుకు ముందు ఈ నిర్ణయం ఆసక్తి రేపుతోంది.

IND vs ENG : ఇంగ్లాండ్‌తో రెండో వన్డేకు ముందు టీమిండియాకు షాక్.. యంగ్ బౌలర్ పై ఐసీసీ చర్యలు
Ind Vs Eng 2nd Odi

Updated on: Jul 16, 2026 | 4:29 PM

IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగబోయే రెండో వన్డే మ్యాచ్‌కు ముందు టీమిండియా క్యాంప్‌లో ఒక ఆందోళనకర పరిణామం చోటుచేసుకుంది. బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో అద్భుత విజయంతో సిరీస్‌లో మంచి ఊపు మీదున్న శుభ్‌మన్ గిల్ సేనకు ఐసీసీ ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్‌పై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. మొదటి వన్డేలో క్రీడా నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ అతడి ఖాతాలో ఒక డిమెరిట్ పాయింట్‌ను చేరుస్తున్నట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో రెండో వన్డే జరగడానికి కొన్ని గంటల ముందే ఈ నిర్ణయం రావడం గమనార్హం.

మొదటి వన్డే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్, భారత బౌలర్ గుర్నూర్ బ్రార్ మధ్య మైదానంలో హై-వోల్టేజ్ డ్రామా నడిచింది. గుర్నూర్ బ్రార్ వేసిన ఓవర్‌లో బెన్ డకెట్ కళ్ళు చెదిరే సిక్సర్ బాదాడు. ఆ దెబ్బతో తీవ్ర నిరాశకు గురైన గుర్నూర్ బ్రార్ తన సహనాన్ని కోల్పోయాడు. ఆ తర్వాతి బంతిని వేసిన బ్రార్, బ్యాటర్ ఆడిన షాట్‌ను తన ఫాలో-త్రూలో పట్టుకుని, ఒక్కసారిగా కోపంతో బెన్ డకెట్ వైపు బంతిని బలంగా విసిరాడు. ఆ బంతి తన ఒంటికి తగలకుండా డకెట్ పక్కకు తప్పుకోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన మ్యాచ్ రిఫరీ, గుర్నూర్ బ్రార్‌ను దోషిగా తేల్చారు.

ఐసీసీ నిబంధనలలోని ఆర్టికల్ 2.9 ప్రకారం.. అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఏ ఆటగాడైనా సరే ఎదుటి ప్లేయర్ వైపు ప్రమాదకరంగా లేదా అనవసరంగా బంతిని విసరడం తీవ్రమైన నేరం. గుర్నూర్ బ్రార్ సరిగ్గా ఇదే తప్పు చేసి దొరికిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తర్వాత బ్రార్ చేసిన మొదటి తప్పు ఇదే కావడంతో ఐసీసీ కేవలం అధికారిక హెచ్చరిక జారీ చేసి, ఒక డిమెరిట్ పాయింట్‌తో సరిపెట్టింది. దీనికి ఎలాంటి ఫైన్ విధించలేదు. గుర్నూర్ బ్రార్ కూడా విచారణలో తన తప్పును ఒప్పేసుకోవడంతో ఈ వివాదానికి ఎలాంటి ఫార్మల్ హియరింగ్ అవసరం లేకుండానే ఐసీసీ ముగింపు పలికింది.

తొలి వన్డేలో బెన్ డకెట్ మొదట్లో గుర్నూర్ బ్రార్‌పై విరుచుకుపడి కేవలం 10 బంతుల్లోనే 24 పరుగులు పిండుకున్నాడు. కానీ ఆ తర్వాత బ్రార్ అద్భుతంగా పుంజుకుని ఇంగ్లాండ్‌ను దెబ్బకొట్టాడు. ప్రమాదకరంగా మారుతున్న బెథెల్‌ను షార్ట్ బాల్‌తో అవుట్ చేయడమే కాకుండా, తనతో గొడవకు దిగిన బెన్ డకెట్‌ను 13వ ఓవర్‌లో పెవిలియన్‌కు పంపి అసలైన పగ తీర్చుకున్నాడు. ఈ రెండు కీలక వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. బ్రార్ ఇచ్చిన వికెట్ల బ్రేక్‌తో మిగిలిన భారత బౌలర్లు రెచ్చిపోయి హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, సామ్ కరన్, విల్ జాక్స్ వికెట్లను టకటకా పడగొట్టారు. ఆ మ్యాచ్‌లో బ్రార్ 9 ఓవర్లలో 61 పరుగులు ఇచ్చినా ఇంపాక్ట్ ప్లేయర్‌గా నిలిచాడు. తన బుల్లెట్ వేగంతో ఇంగ్లాండ్ బ్యాటర్లను వణికించగల సామర్థ్యం ఉన్న గుర్నూర్ బ్రార్, ఈ ఐసీసీ షాక్ తర్వాత రెండో వన్డేలో మరింత కసిగా ఆడి టీమిండియాకు ఎక్స్-ఫ్యాక్టర్ గా మారుతాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us