AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌కు మరో భారీ క్రికెట్ స్టేడియం! 100 ఎకరాల్లో ప్రపంచంలోనే అతి పెద్దదిగా..

హైదరాబాద్‌ భారత్ ఫ్యూచర్ సిటీలో భారీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సుమారు 100 ఎకరాల్లో 1.32 లక్షలకుపైగా సీట్ల సామర్థ్యంతో స్టేడియం నిర్మించాలని ప్రతిపాదించారు. ముచ్చెర్ల సమీపంలో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం భూమి అందించనుండగా, బీసీసీఐ నిర్మాణం, నిర్వహణకు నిధులు సమకూర్చే ప్రతిపాదన ఉంది.

హైదరాబాద్‌కు మరో భారీ క్రికెట్ స్టేడియం! 100 ఎకరాల్లో ప్రపంచంలోనే అతి పెద్దదిగా..
Hyderabad Cricket Stadium
SN Pasha
|

Updated on: Aug 30, 2026 | 6:05 PM

Share

హైదరాబాద్ క్రీడా రంగంలో మరో భారీ ప్రాజెక్ట్‌కు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ స్టేడియంలో 1.32 లక్షలకుపైగా ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉండేలా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉన్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంతో పోటీ పడనుంది.

ముచ్చెర్ల సమీపంలో ప్రతిపాదిత నిర్మాణం

ఈ భారీ స్టేడియాన్ని రంగారెడ్డి జిల్లాలోని ముచ్చెర్ల సమీపంలోని భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో హైదరాబాద్‌కు కీలక పట్టణ విస్తరణ కేంద్రంగా మారనున్న ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలనే ప్రణాళికల్లో భాగంగా ఈ స్టేడియాన్ని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రధాన రహదారి మార్గాలతో అనుసంధానం ఉండేలా ప్రాజెక్ట్‌ను రూపొందించనున్నారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ (ORR), రీజినల్ రింగ్ రోడ్ (RRR), రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సులభంగా చేరుకునే విధంగా కనెక్టివిటీని అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

డిసెంబర్‌లో శంకుస్థాపనకు అవకాశం

స్టేడియం నిర్మాణానికి సంబంధించిన పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌లో శంకుస్థాపన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే తుది తేదీ, నిర్మాణ సంస్థ, పూర్తి ప్రాజెక్ట్ షెడ్యూల్ వంటి అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం-బీసీసీఐ భాగస్వామ్యంతో నిర్మాణం?

ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ప్రభుత్వం భూమిని సమకూర్చనుండగా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్మాణం, నిర్వహణకు నిధులు సమకూర్చే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. ఈ మోడల్‌పై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. క్రికెట్ స్టేడియంతో పాటు భారత్ ఫ్యూచర్ సిటీలో మరిన్ని క్రీడా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. భారీ అంతర్జాతీయ మ్యాచ్‌లు, క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించగల సామర్థ్యంతో స్టేడియం ఏర్పడితే హైదరాబాద్‌కు క్రీడా పర్యాటకం, అంతర్జాతీయ ఈవెంట్ల పరంగా మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.

Follow Us