
Viral Cricket Video: క్రికెట్ ఆటలో బ్యాటర్లు సిక్సర్లు కొడుతుంటే చూసి మురిసిపోయే అభిమానులకు, అప్పుడప్పుడు మైదానంలో ఆటగాళ్లకు తగిలే గాయాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. తాజాగా అండర్-19 స్థాయిలో జరుగుతున్న ఒక మ్యాచ్‌లో స్కాట్లాండ్ బౌలర్ ఈథన్ రామ్సేకు ఎదురైన అనుభవం చూస్తుంటే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే.
స్కాట్లాండ్ అండర్-19 జట్టు తరపున బౌలింగ్ చేస్తున్న ఈథన్ రామ్సే, తన బౌలింగ్ రన్నప్ పూర్తి చేసి బంతిని విసిరే క్రమంలో ల్యాండింగ్ సమయంలో పట్టుతప్పాడు. క్రీజులోకి అడుగుపెట్టే సమయంలో అతని ఎడమ కాలు చీలమండ (Ankle) ఒక్కసారిగా మడతపడింది. దురదృష్టవశాత్తూ, కింద పడే క్రమంలో అదే కాలు మరోసారి ట్విస్ట్ అయ్యింది. అంటే, ఒకే సెకను వ్యవధిలో అతని యాంకిల్ రెండుసార్లు రోల్ అయ్యింది.
ఆ గాయం ఎంత తీవ్రంగా ఉందంటే, రామ్సే వెంటనే మైదానంలోనే కుప్పకూలిపోయి నొప్పితో విలవిలలాడాడు. వెంటనే అంపైర్లు, తోటి ఆటగాళ్లు అతని వద్దకు పరుగెత్తుకు వచ్చారు. మెడికల్ టీమ్ మైదానంలోకి వచ్చి అతనికి ప్రాథమిక చికిత్స అందించాల్సి వచ్చింది. కనీసం లేచి నిలబడలేని స్థితిలో ఉండటంతో, సహచరులు అతన్ని మైదానం బయటకు తీసుకెళ్లారు.
ఈ గాయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. “ఇది చూడటానికే చాలా భయంకరంగా ఉంది.. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒక యువ ఫాస్ట్ బౌలర్‌కు ఇటువంటి గాయం కావడం అతని కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో జరగనున్న అండర్-19 వరల్డ్ కప్ నేపథ్యంలో, స్కాట్లాండ్ జట్టుకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. రామ్సే జట్టులో కీలక బౌలర్‌గా ఉన్నాడు. అతని స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే అతను ఎన్ని రోజులు ఆటకు దూరం కానున్నాడు అనేది స్పష్టమవుతుంది. సాధారణంగా యాంకిల్ ట్విస్ట్ అయినప్పుడు లిగమెంట్ దెబ్బతింటే కోలుకోవడానికి కనీసం కొన్ని వారాల సమయం పడుతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..