CSK Coach : 18 ఏళ్ల తర్వాత సీఎస్‌కేను వీడిన స్టీఫెన్ ఫ్లెమింగ్.. హెడ్ కోచ్‌గా రేసులో భారత మాజీ క్రికెటర్

CSK Coach : 18 ఏళ్లుగా సీఎస్‌కేకు సేవలందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ హెడ్ కోచ్ పదవికి గుడ్‌బై చెప్పారు. ఆయన స్థానంలో భారత మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పులకు మేనేజ్‌మెంట్ సిద్ధమవుతోంది.

CSK Coach : 18 ఏళ్ల తర్వాత సీఎస్‌కేను వీడిన స్టీఫెన్ ఫ్లెమింగ్.. హెడ్ కోచ్‌గా రేసులో భారత మాజీ క్రికెటర్
Csk Coach

Updated on: Jul 13, 2026 | 4:06 PM

CSK Coach : ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మేనేజ్‌మెంట్‌లో ఒక యుగం ముగిసింది. గత 18 సంవత్సరాలుగా ఆ జట్టుతో విడదీయరాని బంధాన్ని కలిగి ఉన్న హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎట్టకేలకు సీఎస్‌కే గుడ్‌బై చెప్పారు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ అయిన 2008లో ఫ్లెమింగ్ ఒక ఆటగాడిగా చెన్నై జట్టు తరఫున బరిలోకి దిగారు. ఆ తర్వాత 2009 సీజన్ నుంచి ఆయన జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ఈ ప్రయాణంలో ఫ్లెమింగ్ పర్యవేక్షణలో చెన్నై ఏకంగా 10 సార్లు ఐపీఎల్ ఫైనల్స్ చేరుకోవడమే కాకుండా, ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచి ట్రోఫీలను ముద్దాడింది.

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నతాధికారులు ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్ నగరంలో ఉన్నారు. అక్కడ ప్రస్తుతం మేజర్ లీగ్ క్రికెట్ (MLC 2026) మ్యాచ్‌లు జరుగుతున్నాయి. 2023లో ఐదోసారి ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత, ఆ తర్వాతి సీజన్లలో సీఎస్‌కే కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తితో ఉన్న యాజమాన్యం.. గత సీజన్ల వైఫల్యాలపై సమీక్ష నిర్వహించడంతో పాటు భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. కేవలం హెడ్ కోచ్ మాత్రమే కాకుండా, జట్టులోని మొత్తం కోచింగ్ స్టాఫ్‌ను సమూలంగా మార్చేందుకు యాజమాన్యం గట్టిగా ప్లాన్ చేస్తోంది.

స్టీఫెన్ ఫ్లెమింగ్ నిష్క్రమణతో చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి హెడ్ కోచ్ ఎవరు కాబోతున్నారనే దానిపై టెక్నికల్ సర్కిల్స్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, భారత మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీ చెన్నై కొత్త హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బదానీకి కోచింగ్‌లో మంచి అనుభవం ఉంది. ఆయన గత రెండు ఐపీఎల్ సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కోచ్‌గా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఒకవేళ ఐపీఎల్ 2027 సీజన్ నాటికి బదానీ చెన్నై జట్టుతో చేరితే.. హోమ్ గ్రౌండ్ పిచ్‌లపై ఆయనకున్న పట్టు జట్టుకు ఎంతగానో కలిసి రానుంది.

హేమంగ్ బదానీకి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొత్తేమీ కాదు. గతంలో 2010 ఐపీఎల్ సీజన్ సమయంలో సీఎస్‌కే జట్టు బదానీని ఒక ఆటగాడిగా తమ స్క్వాడ్‌లోకి సైన్ చేసింది. అయితే దురదృష్టవశాత్తూ ఆ సీజన్‌లో అతనికి ఒక్క మ్యాచ్‌లో కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడే అవకాశం రాలేదు. కానీ కాలం తిరిగొచ్చి ఇప్పుడు అదే జట్టుకు ఏకంగా హెడ్ కోచ్ అయ్యే సువర్ణావకాశం ఆయన తలుపు తట్టింది. హేమంగ్ బదానీ కెరీర్ విషయానికి వస్తే.. ఆయన 2000 నుంచి 2004 మధ్య కాలంలో భారత జాతీయ జట్టు తరఫున 40 వన్డేలు, 4 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. అంతర్జాతీయ కెరీర్‌లో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీల సహాయంతో మొత్తం 961 పరుగులు చేశారు. మరి ఈ సరికొత్త గురువు ఆధ్వర్యంలో చెన్నై సూపర్ కింగ్స్ రాబోయే సీజన్లలో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us