Gautami Naik: క్రమశిక్షణ ముఖ్యం..హార్దిక్ మెసేజ్‎కు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ కళ్లలో ఆనంద బాష్పాలు

Gautami Naik: మహిళా ప్రీమియర్ లీగ్‎లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయ పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసిన ఆర్సీబీ టేబుల్ టాప్‌లో దూసుకుపోతోంది. గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘనవిజయం సాధించింది.

Gautami Naik: క్రమశిక్షణ ముఖ్యం..హార్దిక్ మెసేజ్‎కు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ కళ్లలో ఆనంద బాష్పాలు
Gautami Naik

Updated on: Jan 20, 2026 | 2:47 PM

Gautami Naik: మహిళా ప్రీమియర్ లీగ్‎లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయ పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసిన ఆర్సీబీ టేబుల్ టాప్‌లో దూసుకుపోతోంది. గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘనవిజయం సాధించింది. అయితే ఈ గెలుపు కంటే ఎక్కువగా ఇప్పుడు సోషల్ మీడియాలో గౌతమి నాయక్ అనే ప్లేయర్ పేరు మారుమోగిపోతోంది. తన ఆరాధ్య దైవం హార్దిక్ పాండ్యా నుంచి ఆమె అందుకున్న సర్ ప్రైజ్ మెసేజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ కష్టాల్లో ఉన్నప్పుడు నంబర్ 4లో బ్యాటింగ్‌కు వచ్చిన గౌతమి నాయక్ అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 55 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించింది. మ్యాచ్ అనంతరం ఆమె మాట్లాడుతూ తన సక్సెస్ సీక్రెట్ చెప్పింది. “నాకు హార్దిక్ పాండ్యా అంటే చాలా ఇష్టం. ఆయనే నా రోల్ మోడల్. ఒత్తిడిలో ఆయన ఎంత ప్రశాంతంగా ఆడతారో, నేను కూడా అలాగే ఆడటానికి ప్రయత్నిస్తాను. ఆయన ఆటతీరును నేను కాపీ చేస్తాను” అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది.

గౌతమి తన అభిమానాన్ని చాటుకుంటున్న సమయంలోనే డబ్ల్యూపీఎల్ నిర్వాహకులు ఆమెకు ఒక పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు. స్వయంగా హార్దిక్ పాండ్యా పంపిన వీడియో సందేశాన్ని ఆమెకు చూపించారు. అది చూడగానే గౌతమి ఆనందానికి అవధులు లేవు. వీడియోలో పాండ్యా మాట్లాడుతూ.. “హలో గౌతమి, నువ్వు నన్ను రోల్ మోడల్‌గా భావిస్తున్నావని తెలిసి చాలా సంతోషంగా ఉంది. నీ మొదటి హాఫ్ సెంచరీకి అభినందనలు. ఆటను ఎంజాయ్ చేయి. భవిష్యత్తులో నీ ఫ్రాంచైజీకి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఎప్పుడూ క్రమశిక్షణతో ఉండు. ఆల్ ది బెస్ట్” అని ఆశీర్వదించాడు.

గౌతమి నాయక్ ఈ స్థాయికి రావడం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి. 27 ఏళ్ల గౌతమి క్రికెట్ ప్రయాణం 2013లో మొదలైంది. ఆమె తండ్రి చనిపోవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. క్రికెట్ కిట్ కొనేందుకు కూడా డబ్బులు లేక, కేవలం టీ మాత్రమే తాగి ఖాళీ కడుపుతో మ్యాచ్‌లు ఆడిన రోజులు ఉన్నాయని ఆమె కోచ్ అవినాష్ షిండే గుర్తు చేసుకున్నారు. నిజానికి ఆమె ఫాస్ట్ బౌలర్ కావాలనుకుంది. కానీ గాయాలైతే చికిత్స చేయించుకునే ఆర్థిక స్తోమత లేక, తన ఫోకస్‌ను బ్యాటింగ్‌ వైపు మళ్లించింది. నేడు అదే బ్యాట్‌తో ఆర్సీబీని గెలిపించి స్టార్‌గా ఎదిగింది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..