Hardik Pandya : మైదానంలో విధ్వంసం..కెమెరామెన్‌ పట్ల వినయం..పాండ్యా చేసిన ఈ పనికి నెటిజన్లు ఫిదా

Hardik Pandya : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐదో టీ20 మ్యాచ్ కేవలం సిక్సర్ల వర్షానికే కాదు, ఒక అద్భుతమైన మానవీయ కోణానికి కూడా వేదికైంది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, మైదానం బయట అంతకంటే ఎక్కువ సున్నిత మనస్కుడని ఈ ఘటనతో నిరూపించుకున్నాడు.

Hardik Pandya : మైదానంలో విధ్వంసం..కెమెరామెన్‌ పట్ల వినయం..పాండ్యా చేసిన ఈ పనికి నెటిజన్లు ఫిదా
Hardik Pandya

Updated on: Dec 20, 2025 | 10:24 AM

Hardik Pandya : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐదో టీ20 మ్యాచ్ కేవలం సిక్సర్ల వర్షానికే కాదు, ఒక అద్భుతమైన మానవీయ కోణానికి కూడా వేదికైంది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, మైదానం బయట అంతకంటే ఎక్కువ సున్నిత మనస్కుడని ఈ ఘటనతో నిరూపించుకున్నాడు. బ్యాటింగ్‌లో పవర్‌ఫుల్ సిక్సర్లతో విరుచుకుపడిన హార్దిక్, తన వల్ల గాయపడిన ఒక కెమెరామెన్ పట్ల చూపించిన చొరవ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి హృదయాలను గెలుచుకుంటోంది.

అసలేం జరిగిందంటే.. ఇన్నింగ్స్ మధ్యలో హార్దిక్ కొట్టిన ఒక మెరుపు సిక్సర్ బౌండరీ లైన్ వద్ద ఉన్న కెమెరామెన్ భుజానికి బలంగా తగిలింది. ఆ బంతి వేగం ఎంత ఎక్కువగా ఉందంటే, కెమెరామెన్ ఒక్కసారిగా నొప్పితో విలవిలలాడిపోయాడు. డగౌట్ సమీపంలోనే ఈ ఘటన జరగడంతో కోచ్ గౌతమ్ గంభీర్, శివమ్ దూబే కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. భారత టీమ్ ఫిజియో వెంటనే అక్కడికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు.

భారత ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే హార్దిక్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఆ కెమెరామెన్ దగ్గరకు వెళ్లాడు. అతని గాయాన్ని స్వయంగా పరిశీలించి, ఐస్ ప్యాక్ పెట్టడంలో సాయం చేశాడు. “సారీ బ్రదర్.. నా వల్ల నీకు ఇబ్బంది కలిగింది” అంటూ హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పాడు. దానికి ఆ కెమెరామెన్ కూడా చిరునవ్వుతో స్పందిస్తూ.. “పర్వాలేదు సార్.. ఏమీ కాలేదు” అని బదులివ్వడం విశేషం. ఆ తర్వాత హార్దిక్ అతడిని ఆప్యాయంగా హగ్ చేసుకుని ఓదార్చాడు.

తర్వాత హార్దిక్ ఈ విషయంపై స్పందిస్తూ.. “దేవుడి దయ వల్ల ఆ బంతి మరీ పైకి తగలలేదు. గాయం చిన్నదే అయినా, రేపటికి అక్కడ వాపు వచ్చే అవకాశం ఉంది. అతనికి పెద్ద ప్రమాదం తప్పినందుకు చాలా సంతోషంగా ఉంది” అని చెప్పుకొచ్చాడు. కేవలం ఆటలోనే కాదు, తోటి మనుషుల పట్ల బాధ్యతగా ఉండటంలో కూడా హార్దిక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనిపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ 25 బంతుల్లో 63 పరుగులు చేయడమే కాకుండా, బౌలింగ్‌లో బ్రేవిస్ వికెట్ తీసి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..