Mumbai Indians : ముంబై కెప్టెన్ మార్పుపై వస్తున్న వార్తల్లో నిజమెంత?.. అతడిని వదులుకోకపోవడానికి 3 కారణాలవే ?

Mumbai Indians : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్లేఆఫ్ రేసు నుంచి జట్టు త్వరగానే నిష్క్రమించడంతో, కెప్టెన్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై నీలినీడలు ముసురుకున్నాయి. కానీ ముంబై మేనేజ్‌మెంట్ హార్దిక్‌ను వదులుకునే అవకాశం అస్సలు కనిపించడం లేదు

Mumbai Indians : ముంబై కెప్టెన్ మార్పుపై వస్తున్న వార్తల్లో నిజమెంత?.. అతడిని వదులుకోకపోవడానికి 3 కారణాలవే ?
Hardik Pandya

Updated on: May 13, 2026 | 6:06 PM

Mumbai Indians : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్లేఆఫ్ రేసు నుంచి జట్టు త్వరగానే నిష్క్రమించడంతో, కెప్టెన్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై నీలినీడలు ముసురుకున్నాయి. అతడిని జట్టు నుంచి తొలగిస్తారని లేదా వేరే జట్టుకు ట్రేడ్ చేస్తారని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే వాస్తవ పరిస్థితులను విశ్లేషిస్తే ముంబై మేనేజ్‌మెంట్ హార్దిక్‌ను వదులుకునే అవకాశం అస్సలు కనిపించడం లేదు. దానికి గల కారణాలను తెలుసుకుందాం.

సొంత బిడ్డపై ముంబై మేనేజ్‌మెంట్‌కు ఉన్న నమ్మకం

హార్దిక్ పాండ్యా ఒకప్పుడు ముంబై ఇండియన్స్ స్కౌటింగ్ నెట్‌వర్క్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆటగాడు. 2015లో బరోడా తరపున ఆడుతున్న హార్దిక్‌ను జాన్ రైట్ గుర్తించి ముంబై జట్టులోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి ముంబై సాధించిన నాలుగు టైటిల్ విజయాల్లో హార్దిక్ కీలక పాత్ర పోషించారు. కేవలం బ్యాటర్ గా ఉన్న అతడిని ఒక మ్యాచ్ విన్నర్ ఆల్ రౌండర్ గా తీర్చిదిద్దింది ముంబై మేనేజ్‌మెంటే. అతడి బలాలు, బలహీనతలు మేనేజ్‌మెంట్‌కు బాగా తెలుసు కాబట్టి, ఒక్క సీజన్ వైఫల్యంతో అతడిని వదులుకోవడానికి వారు సిద్ధంగా లేరు.

భారత జట్టు కోసం నిరూపితమైన మ్యాచ్ విన్నర్

ఐపీఎల్ 2026లో హార్దిక్ గణంకాలు అంత ఆశాజనకంగా లేవు. ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో కేవలం 146 పరుగులు మాత్రమే చేసి, బౌలింగ్‌లోనూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో హార్దిక్ క్రేజ్ వేరు. ముఖ్యంగా 2024, 2026 టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టులో హార్దిక్ పోషించిన పాత్ర అద్వితీయం. ఒత్తిడిలో ఎలా ఆడాలో తెలిసిన అతడి వంటి వరల్డ్ క్లాస్ ఆల్ రౌండర్ ను వదులుకోవడం అంటే ప్రత్యర్థి జట్టుకు పెద్ద అవకాశం ఇచ్చినట్లేనని ముంబై భావిస్తోంది.

ప్రస్తుతానికి ప్రత్యామ్నాయ కెప్టెన్ ఎవరు?

హార్దిక్‌ను తొలగిస్తే జట్టు బాధ్యతలు ఎవరికి ఇవ్వాలనేది ముంబై ముందున్న పెద్ద ప్రశ్న. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ, వారంతా కెరీర్ ఆఖరి దశలో ఉన్నారు. అలాగే తరచుగా గాయాల బారిన పడే అవకాశం కూడా ఉంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక యువ నాయకుడిని వెతకాలి అంటే వచ్చే మెగా వేలం వరకు వేచి చూడాల్సిందే. అంతవరకు అనుభవం ఉన్న హార్దిక్ పాండ్యానే జట్టును నడిపించడం ముంబైకి సురక్షితమైన మార్గం.

కేవలం ఆట పరంగానే కాకుండా, బ్రాండ్ విలువ పరంగా కూడా హార్దిక్ ముంబైకి ఎంతో ముఖ్యం. గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ మొత్తంతో తిరిగి తెచ్చుకున్న ఆటగాడిని వెంటనే వదిలేయడం మేనేజ్‌మెంట్ వైఫల్యంగా మారుతుంది. అందుకే ఐపీఎల్ 2027లో కూడా హార్దిక్ పాండ్యా ముంబై జెర్సీలోనే కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us