
Gurnoor Brar: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా యంగ్ ఫేసర్ గుర్నూర్ బ్రార్ అదరగొట్టాడు. మొదటి ఓవర్లోనే టిమ్ సైఫర్ట్ అతడి బౌలింగ్‌లో సిక్సర్ బాదాడు. అయినా గుర్నూర్ నిరాశ చెందలేదు. వెంటనే తన బౌలింగ్‌లో మార్పులు చేసుకున్నాడు. ఈ క్రమంలో అర్ష్‌దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్ ఇచ్చిన సలహాలు కూడా అతడికి బాగా ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత సైఫర్ట్‌తో పాటు మరో ఇద్దరు న్యూజిలాండ్ బ్యాటర్లను పెవిలియన్‌కు పంపి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 13వ ఓవర్లో గుర్నూర్‌కు బంతి అందించాడు. అయితే తన మొదటి ఓవర్లోనే గుర్నూర్ 13 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో సైఫర్ట్ కొట్టిన సిక్సర్ కూడా ఉంది. ఆ బంతి కొంచెం ముందుగా పడటంతో బ్యాటర్‌కు భారీ షాట్ ఆడే అవకాశం దక్కిందని గుర్నూర్ గుర్తించాడు. దీంతో తర్వాతి ఓవర్లలో బంతిని కొంచెం వెనక్కి వేసి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నాడు.
ఈ మార్పు గురించి అప్పటికే ఆ మైదానంలో బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్‌తో గుర్నూర్ చర్చించాడు. తన 6.5 అడుగుల హైట్ ఉపయోగించుకోవాలంటే హార్డ్ లెంగ్త్‌లో బంతులు వేయాలని వారు సూచించారు. అంటే బ్యాటర్‌కు పూర్తిగా ముందుకు వచ్చి ఆడే అవకాశం ఇవ్వకుండా, పిచ్‌పై కొంచెం వెనక్కి పడేలా వేగంగా బంతులు వేయడం అన్నమాట. దీనివల్ల బంతి ఎక్కువగా బౌన్స్ అవుతుంది. గుర్నూర్ ఎత్తు కూడా అతడికి అదనపు ప్రయోజనం కలిగిస్తుంది. ఈ సలహాను అమలు చేసి అతడు సైఫర్ట్‌ను ఇబ్బంది పెట్టాడు.
15వ ఓవర్‌లో గుర్నూర్ వేసిన ఫాస్ట్ బంతిని సైఫర్ట్ సరిగ్గా ఆడలేకపోయాడు. బంతి బ్యాట్ పైభాగానికి తగిలి మిడ్ ఆన్ దిశగా వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ప్రత్యామ్నాయ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ అందుకోవడంతో సైఫర్ట్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత టామ్ లాథమ్, బ్లెయిర్ టిక్నర్ వికెట్లను కూడా గుర్నూర్ తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 9.2 ఓవర్లలో 44 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఒక సిక్సర్‌తో మొదలైన అతడి బౌలింగ్.. మూడు వికెట్లతో ముగియడం విశేషం.
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు సమష్టిగా రాణించారు. అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టగా, గుర్నూర్ మూడు వికెట్లు తీశాడు. అన్షుల్ కాంబోజ్ 10 ఓవర్లలో కేవలం 22 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు. దీంతో న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌటైంది. వర్షం కారణంగా భారత్ లక్ష్యాన్ని 32 ఓవర్లలో 143 పరుగులుగా నిర్ణయించారు. విరాట్ కోహ్లీ 74 పరుగులతో రాణించడంతో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఐదు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో అన్షుల్ కాంబోజ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..