Gujarat Titans, IPL 2022: కొత్త జట్టు.. కొత్త కెప్టెన్.. అదిరిందయ్యా హార్దిక్.. కానీ, అసలు సమస్య అక్కడే ఉందిగా..

|

Mar 18, 2022 | 7:46 AM

గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans Playing 11) మార్చి 28న లక్నో సూపర్‌జెయింట్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఐపీఎల్‌లోకి ప్రవేశించబోతోంది.

Gujarat Titans, IPL 2022: కొత్త జట్టు.. కొత్త కెప్టెన్.. అదిరిందయ్యా హార్దిక్.. కానీ, అసలు సమస్య అక్కడే ఉందిగా..
Titans
Follow us on

ఐపీఎల్ (IPL 2022) 15వ సీజన్‌లోకి ఈ ఏడాది రెండు కొత్త జట్లు ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్. అహ్మదాబాద్‌ కేంద్రంగా ఈ టీం ఐపీఎల్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కార్పొరేట్‌ వెంచర్స్‌ క్యాపిటల్‌ (CVC) రూ.5625 కోట్లతో గుజరాత్‌ ఫ్రాంఛైజీని దక్కించుకుంది. ఇందులో స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ (రూ.15 కోట్లు), ఓపెనర్‌ శుభ్మన్‌ గిల్‌ (రూ.8 కోట్లు) లాంటి ఆటగాళ్లను వేలంలో దక్కించుకుంది. వీరితో పాటు వేలంలో మరో 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసింది. ఐపీఎల్ 2022 వేలంలో గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లను గెలవగల సామర్థ్యం ఉన్న ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ తమ తొలి మ్యాచ్‌ను లక్నో సూపర్‌జెయింట్‌తో ఆడాల్సి ఉంది. లక్నో జట్టు కూడా తొలిసారిగా ఐపీఎల్‌లోకి అడుగుపెట్టబోతోంది. రెండు జట్లు కొత్తవి, కాబట్టి అభిమానులందరూ ఈ పోటీపై చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలు ప్రశ్న ఏమిటంటే, ఒకరు కంటే ఎక్కువ మంది మ్యాచ్ విన్నర్ ఆటగాళ్లతో కూడిన గుజరాత్ టైటాన్స్ జట్టు.. ప్లేయింగ్ XIలో ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి. గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XIలో ఎవరు ఉంటారో TV9 తెలుగు స్పోర్ట్స్ డెస్క్ టీం ఓ జాబితాను సిద్ధం చేసింది. ఈ టీమ్ రంగంలోకి దిగితే ఎన్నో పెద్ద జట్లకు గట్టి పోటీని ఇవ్వనుందనడంలో సందేహం లేదు. గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ 11లో ఎలాంటి ఆటగాళ్లకు (Gujarat Titans Playing 11) అవకాశం ఇవ్వనుందో ఇప్పుడు చూద్దాం..

గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్‌మెన్స్..

గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ గురించి మాట్లాడితే, శుభ్‌మన్ గిల్‌తో ఓపెనింగ్‌ చేసేందుకు మాథ్యూ వేడ్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్.. తుఫాను బ్యాటింగ్‌కు పేరుగాంచాడు. ఇంతకుముందు జాసన్ రాయ్‌ను జట్టు కొనుగోలు చేసింది. కానీ, ఈ ఆటగాడు టోర్నమెంట్ నుంచి వైదొలడంతో మాథ్యూ వేడ్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. వీరితోపాటు డేవిడ్ మిల్లర్, గురుకీరత్ మాన్ కూడా ఈ జట్టుకు కీలక బ్యాట్స్‌మెన్స్‌గా మారే ఛాన్స్ ఉంది.

గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండర్స్..

కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టులో కీలక ఆల్ రౌండర్‌గా ఉన్నాడు. జట్టుకు సారథిగాను ఉండడంతో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. హార్దిక్‌తో పాటు విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా కూడా బాల్‌తోపాటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.

గుజరాత్ టైటాన్స్ బౌలింగ్..

గుజరాత్ టైటాన్స్ బౌలింగ్‌ విభాగానికి రషీద్ ఖాన్ సారథ్యం వహించనున్నాడు. ఆ‍యనతో పాటు ఎడమచేతి వాటం స్పిన్నర్ ఆర్. సాయి కిషోర్ గుజరాత్ టైటాన్స్ బౌలింగ్‌ను బలోపేతం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఫాస్ట్ బౌలింగ్‌లో మహ్మద్ షమీ, లోకీ ఫెర్గూసన్ ఈ జట్టుకు ఫాస్ట్ బౌలింగ్ అందించనున్నారు.

బలాలు..

ఆల్ రౌండర్ హార్దిక్‌ పాండ్య, దిగ్గజ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ గుజరాత్ టైటాన్స్ టీంకు ప్రధాన బలంగా ఉండనున్నారు. మ్యాచులను మార్చగల శక్తి వీరిలో ఉంది. హార్దిక్ తొలిసారి సారథిగా చేయనుండడంతో, అతనిపైనే ఎక్కువ ఫోకస్ ఉండనుంది. ఇక ఆఫ్గాన్ బౌలర్ రషీద్‌ఖాన్‌.. పొదుపుగా బౌలింగ్‌ చేయడంతోపాటు కీలక దశలో బ్యాట్స్‌మెన్స్‌‌ను పెవిలియన్ చేర్చడంలో దిట్టగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. వీరితోపాటు తెవాతియా, విజయ్‌శంకర్‌‌ల ఫాం కూడా గుజరాత్ టీంకు కొండత బలంగా మారనుంది. ఇక హిట్టర్ల విషయానికి వస్తే.. మిల్లర్‌, రహ్మతుల్లా గుర్బాజ్‌‌లు ఉండనే ఉన్నారు. బౌలింగ్‌లో రషీద్‌, మహ్మద్‌ షమి, అల్జారీ జోసెఫ్‌‌లు కూడా గుజరాత్ జట్టుకు విజయాలు అందించగలరు.

బలహీనతలు…

సారథి పాండ్య గుజరాత్ టైటాన్స్ టీంకు కొండంత బలమే కాదు బలహీనతలా కనిపిస్తున్నాడు. ఆల్‌రౌండర్‌‌గా జట్టులో చేరిన హార్దిక్.. గత కొంత కాలంగా ఫామ్‌లో లేడు. దీనికితోడు గాయాలు, ఫిట్‌నెస్‌‌తో తెగ ఇబ్బంది పడుతున్నాడు. అలాగే ఎన్నో రోజులుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. తాజాగా ఫిట్‌నెస్ సాధించినా.. ఏమాత్రం రాణిస్తాడో తెలియదు. అలాగే ఇప్పటి వరకు సారథ్యం చేయలేదు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ కీలక ప్లేయర్ జేసన్‌ రాయ్‌ లీగ్‌ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మరో ప్లేయర్ మిల్లర్‌ ఫాం కూడా ఆందోళన కలిగిస్తోంది. మరో ఆల్ రౌండర్ విజయ్‌ శంకర్‌ ఇప్పటి వరకు అంతగా ఆకట్టుకోలేదు. తెవాతియా కూడా తొలి సీజన్‌లా సత్తా చాటలేకపోతున్నాడు. శుభ్‌మన్‌ మాత్రం పరుగుల వదర పారిస్తున్నా.. తనకు తోడుగా ఓపెనర్‌గా ఎవరు బరిలోకి దిగుతారో తెలియదు. ఇన్ని ప్రతికూలతల మధ్య గుజరాత్ ఎలా రాణిస్తుందో చూడాలి.

గుజరాత్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11: శుభమన్ గిల్, మాథ్యూ వేడ్, విజయ్ శంకర్, గురుకీరత్ సింగ్ మాన్, డేవిడ్ మిల్లర్, హార్దిక్ పాండ్యా, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, మహ్మద్ షమీ, లోకీ ఫెర్గూసన్

Also Read: MS Dhoni: ఎట్టకేలకు ధోని ఆ రహస్యాన్ని బయటపెట్టాడు.. తెలిస్తే మీరు షాక్‌ అవుతారు..!

IPL 2022: ఐపీఎల్‌తో పీఎస్‌ఎల్‌ ఎప్పటికీ పోటీ రాదు.. ఏం చేసినా అది సాధ్యం కాదు.. రమీజ్‌ రజా వ్యాఖ్యలపై చోప్రా విసుర్లు..