Cricket Record : కేవలం 7 రన్స్ ఇచ్చి 8 వికెట్లు.. 130 ఏళ్లుగా క్రికెట్ చరిత్రలో చెక్కుచెదరని రికార్డు

Cricket Record : టెస్ట్ క్రికెట్ చరిత్రలో 130 ఏళ్లుగా చెక్కుచెదరని జార్జ్ లోహ్‌మన్ రికార్డు గురించి తెలుసా ? 1896లో సౌతాఫ్రికాపై కేవలం 7 పరుగులకే 8 వికెట్లు తీసి సృష్టించిన ఈ అరుదైన ఘనత ఇప్పటికీ ఎవరికీ అందని ఎత్తులో నిలిచింది.

Cricket Record  : కేవలం 7 రన్స్ ఇచ్చి 8 వికెట్లు.. 130 ఏళ్లుగా క్రికెట్ చరిత్రలో చెక్కుచెదరని రికార్డు
George Lohmann

Updated on: Jun 15, 2026 | 7:40 AM

Cricket Record : క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులు నమోదవుతుంటాయి, కాలక్రమేణా అవి బద్దలవుతుంటాయి. కానీ టెస్ట్ క్రికెట్ చరిత్రలో కొన్ని రికార్డులు మాత్రం కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతాయి. ఒకే టెస్ట్ ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే, జిమ్ లేకర్, ఎజాజ్ పటేల్ వంటి బౌలర్ల రికార్డులు మనకు గుర్తున్నాయి. అయితే, వీటన్నింటికంటే భిన్నంగా గత 130 ఏళ్లకు పైగా ఎవరికీ సాధ్యం కాని రీతిలో అజేయంగా నిలిచిన ఒక అద్భుతమైన రికార్డ్ ఇంగ్లాండ్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ జార్జ్ లోహ్‌మన్ పేరిట నమోదై ఉంది. ఆయన కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు పడగొట్టి సృష్టించిన ఈ రికార్డ్ నేటికీ చెక్కుచెదరలేదు.

1896 నాటి ఇంగ్లాండ్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్

ఈ చారిత్రాత్మక ప్రదర్శన 1896లో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో చోటుచేసుకుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో జార్జ్ లోహ్‌మన్ తన పవర్‌ఫుల్ బౌలింగ్‌తో సౌతాఫ్రికా బ్యాటర్ల వెన్ను విరిచాడు. మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆయన అద్భుతంగా బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టాడు. ఆయన దెబ్బకు సౌతాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 93 పరుగులకే కుప్పకూలిపోయింది. అయితే అసలైన హిస్టరీ అంతా మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో నమోదైంది.

కేవలం 7 పరుగులకే 8 వికెట్లతో సరికొత్త రికార్డ్

ఈ మ్యాచ్‌ ఆఖరి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు సౌతాఫ్రికా ముందు 319 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ కష్టమైన టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా బ్యాటర్లు జార్జ్ లోహ్‌మన్ వేగానికి, పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌కు పూర్తిగా చేతులెత్తేశారు. ఈ ఇన్నింగ్స్‌లో జార్జ్ కేవలం 9.4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి, అందులో 6 మెయిడెన్ ఓవర్లు వేసి, కేవలం 7 రన్స్ మాత్రమే ఇచ్చి ఏకంగా 8 వికెట్లు (8/7) పడగొట్టాడు. ఆయన అరాచకమైన బౌలింగ్ కారణంగా సౌతాఫ్రికా టీమ్ మొత్తం కేవలం 30 పరుగులకే ఆలౌట్ అయింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఒక బౌలర్ అత్యంత తక్కువ రన్స్ ఇచ్చి 8 వికెట్లు తీసిన అత్యుత్తమ ఎకనామికల్ రికార్డ్‌గా ఇది చరిత్రలో నిలిచిపోయింది.

28 రన్స్ ఇచ్చి 9 వికెట్లు తీసిన జార్జ్

జార్జ్ లోహ్‌మన్ రికార్డుల వేట అక్కడితోనే ఆగలేదు. అదే పర్యటనలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో కూడా ఆయన తన బౌలింగ్ మ్యాజిక్‌ను రిపీట్ చేశాడు. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆయన కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి 9 వికెట్లు (9/28) సాధించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యంత తక్కువ రన్స్ ఇచ్చి 9 వికెట్లు పడగొట్టిన రికార్డ్ కూడా నేటికీ జార్జ్ లోహ్‌మన్ పేరిటే భద్రంగా ఉంది. ఈ రికార్డులను సమం చేయడం కానీ, బద్దలు కొట్టడం కానీ ప్రస్తుత తరం బౌలర్లకు దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

అత్యంత వేగంగా 100 టెస్ట్ వికెట్ల మైలురాయి

తన కెరీర్‌లో కేవలం 18 టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన జార్జ్ లోహ్‌మన్ మొత్తంగా 112 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఆయన తన 16వ టెస్ట్ మ్యాచ్‌లోనే 100 వికెట్ల మైలురాయిని చేరుకుని, ఆ కాలంలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్న ఈ ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్ అనారోగ్య కారణాల వల్ల కేవలం 36 ఏళ్ల చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాడు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన సృష్టించిన ఈ 130 ఏళ్ల నాటి అరుదైన రికార్డులు క్రికెట్ ఉన్నంత కాలం ఆయన పేరును సజీవంగా ఉంచుతాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us