Gautam Gambhir: గంభీర్ కోసం క్యూ కట్టిన ఐపీఎల్ జట్లు.. కోచ్ పోస్టుకు ఫుల్ డిమాండ్

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై నాలుగు ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2028 సీజన్‌కు మెంటార్ లేదా కోచ్‌గా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రాజస్థాన్ రాయల్స్‌తో గంభీర్ బృందం ప్రాథమిక చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది.

Gautam Gambhir: గంభీర్ కోసం క్యూ కట్టిన ఐపీఎల్ జట్లు.. కోచ్ పోస్టుకు ఫుల్ డిమాండ్
Gautam Gambhir

Updated on: Oct 30, 2026 | 1:00 PM

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చుట్టూ ఐపీఎల్‌లో మరోసారి చర్చ మొదలైంది. 2028 సీజన్‌కు ముందే ఆయనను తమ జట్టులోకి తీసుకోవాలని నాలుగు ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి. మెంటార్ లేదా కోచ్‌గా బాధ్యతలు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత జట్టుతో కలిసి న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న గంభీర్.. 2027 వన్డే ప్రపంచకప్ వరకు టీమిండియా హెడ్ కోచ్‌గా కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఐపీఎల్‌లోకి తిరిగి వస్తారా? వస్తే ఏ జట్టుతో కలిసి పనిచేస్తారు? అనే ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఏ ఫ్రాంచైజీతోనూ అధికారిక ఒప్పందం కుదిరినట్లు సమాచారం లేదు.

కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్‌తో చర్చలు?

దైనిక్ జాగరణ్ నివేదిక ప్రకారం.. గంభీర్ సేవలను పొందేందుకు నాలుగు జట్లు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో ఆయనకు గతంలో మంచి అనుబంధం ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కూడా ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్య ప్రతినిధులు గంభీర్ బృందంతో ప్రాథమికంగా చర్చలు జరిపినట్లు సమాచారం. మిగిలిన రెండు ఫ్రాంచైజీల పేర్లు మాత్రం బయటకు రాలేదు. వాటిలో ఒకటి ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా, మరొకటి ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్టుగా నివేదిక పేర్కొంది. అయితే ఈ రెండు జట్ల పేర్లపై స్పష్టత లేదు.

2027 ప్రపంచకప్ తర్వాతే అసలు నిర్ణయం

ప్రస్తుతం గంభీర్‌తో బీసీసీఐ చేసుకున్న ఒప్పందం 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఉంది. ఆ తర్వాత కూడా ఆయన సేవలను కొనసాగించాలని బోర్డు భావిస్తే, 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ వరకు పదవీకాలం పొడిగించే అవకాశం ఉందనే చర్చ ఉంది. అదే జరిగితే ఐపీఎల్ జట్ల ప్రణాళికలు మారవచ్చు. అంతేకాదు, భారత జట్టు హెడ్ కోచ్‌గా కొనసాగుతున్న సమయంలో ఐపీఎల్ ఫ్రాంచైజీతో కోచ్ లేదా మెంటార్‌గా పనిచేయడం సాధ్యం కాదు. కాబట్టి గంభీర్ భవిష్యత్తు బీసీసీఐ నిర్ణయం, ఆయన ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది.

కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత టైటిల్

ఐపీఎల్‌లో గంభీర్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2022, 2023 సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరించారు. ఆ రెండు సీజన్లలోనూ లక్నో ప్లేఆఫ్స్‌కు చేరింది. ఆ తర్వాత 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా బాధ్యతలు చేపట్టారు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని కేకేఆర్ జట్టు పదేళ్ల విరామం తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలవడంలో గంభీర్ వ్యూహాలు కీలక పాత్ర పోషించాయి. ఈ విజయంతో ఆయనకు మళ్లీ మంచి గుర్తింపు వచ్చింది.

గంభీర్ వెళ్లిన తర్వాత కేకేఆర్, లక్నో పరిస్థితి ఏంటి?

గంభీర్ టీమిండియా కోచ్‌గా వెళ్లిన తర్వాత కేకేఆర్ ప్రదర్శనలో మార్పు కనిపించింది. ఆ తర్వాతి రెండు సీజన్లలో ఆ జట్టు ఏడో, ఎనిమిదో స్థానాలతో సరిపెట్టుకుని ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయింది. లక్నో సూపర్ జెయింట్స్ కూడా 2024, 2025 సీజన్లలో ఏడో స్థానంలో నిలవగా, 2026లో పదో స్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో గంభీర్‌ను మళ్లీ తమ జట్టులోకి తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని కొన్ని ఫ్రాంచైజీలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన ఐపీఎల్‌లోకి తిరిగి వస్తారా? ఏ జట్టుకు బాధ్యతలు చేపడతారు? అన్నది 2027 ప్రపంచకప్ తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us